ష‌ర్మిల‌పై కొత్త టాక్ నిజ‌మేనా?

ష‌ర్మిల‌పై కొత్త  టాక్ నిజ‌మేనా?

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి తరువాత అంతటి చరిష్మా ఉన్న నాయకులెవరైనా ఉన్నారంటే అది ఆయన సోదరి షర్మిల మాత్రమే. అవినీతి ఆరోపణలతో 16 నెల‌లకు పైగా జగన్‌ జైలు జీవితాన్నిగడిపిన‌పుడు షర్మిల ఒక్కరే అన్నీతానై పాదయాత్రలతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి జీవం పోశారు. రాజన్న బిడ్డ‌ను...జగనన్న విసిరిన బాణాన్ని అంటూ...ప్రజల్లో చొచ్చుకుపోయారు. ఆమె సభలకు కూడా భారీ స్పంద‌న వ‌చ్చింది.

జగన్‌ జైలుకెళితే ఇక పార్టీ అంతే సంగతులు అన్న దశలో సైతం ఆకట్టుకునే ప్రసంగాలతో, సుదీర్ఘ పాదయాత్రలతో పార్టీని ఆమె నిలబెట్టారు. గత ఎన్నికల్లో పార్లమెంటుకుగానీ శాసనసభకుగానీ ఆమె పోటీచేస్తారన్న ప్రచారం కూడా సాగింది. అయితే అనూహ్యంగా ఆమె పోటీకి దూరంగా ఉన్నారు. కుటుంబ రాజకీయాల కారణంగానే ఆమె దూరంగా ఉన్నారంటూ ప్రచారం కూడా జరిగింది. కారణాలు ఏమైనప్పటికీ ఎన్నికలు, జైలు నుండి జగన్‌ విడుదలైన అనంతరం షర్మిల దాదాపు కనుమరుగై ఇంటికే పరిమితమయ్యారు. మధ్య మధ్యలో ఓదార్పు యాత్రల సమయంలో మాత్రమే ఆమె బహిరంగంగా కనిపిస్తున్నారు. అది కూడా తెలంగాణ‌లో జ‌రిగే విష‌యంలో మాత్ర‌మే కావ‌డం గ‌మానార్హం. దీంతో కొత్త చ‌ర్చ ప్రారంభం అయింది.
షర్మిలకు ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం ప్రవేశం లేదా?. అమె ఎంత కాలమైనా పార్టీకి ఏమాత్రం పట్టులేని తెలంగాణలో తిరగాల్సిందేనా? రాబోయే రోజుల్లోనూ ఆమెకు ఏపీలో ప్రవేశం మృగ్యమేనా?. అంటూ వైసీపీ వర్గాల్లోనే జోరుగా చర్చ సాగుతోంది.  తాజాగా ప్ర‌త్యేక హోదా కోసం తిరుప‌తిలో జ‌రిగిన స‌మావేశంలోనూ పార్టీ నేత‌లంతా హాజ‌రైనా ష‌ర్మిల క‌నిపించ‌లేదు.

షర్మిల తెలంగాణలో కాకుండా ఏపీలో కూడా తిరగటం ప్రారంభిస్తే రాజకీయంగా తనకు ఎక్కడ ఇబ్బంది వస్తుందో అన్న ఆందోళనతోనే జగన్‌ ఆమెను పూర్తిగా ఏపీకి దూరం పెట్టారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. జగన్‌ వ్యవహారశైలిపై విజయమ్మతో పాటు సోదరి షర్మిల కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అందుకే విజయమ్మ ఎక్కువ కాలం బెంగుళూరు, ఇడుపులపాయలోనే ఉంటున్నారని చెబుతున్నారు. మొత్తంగా పార్టీ నాయ‌కుడి అంత‌ర్గ‌త ఆలోచ‌న‌ల‌తో ష‌ర్మిల కూడా సైడ‌యిపోవ‌డం ఆస‌క్తిక‌ర‌మే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు