నాయిన... వారికెందుకంత చేశారంటావ్ షర్మిల

నాయిన... వారికెందుకంత చేశారంటావ్ షర్మిల

రాజకీయాల్లో సరికొత్త సంస్కృతిని స్టార్ చేసే నేర్పు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది. ఎవరైనా బ్లాక్ మొయిల్ చేయాలంటే గుట్టుగా చేసుకుపోతారు. కానీ.. జగన్ జట్టు తీరే వేరు. వారు ఆ పనిని కూడా పబ్లిక్ గానే చేసేస్తారు. బరితెగింపుకు నిలువెత్తు నిదర్శనంగా సాగే వారి మాటలకు.. ఓ పద్ధతి పాడు కూడా ఉండదు. అందుకు తాజాగా జగనన్న వదిలిన బాణం షర్మిల ప్రసంగాలే నిదర్శనం. మా నాయినా చాలా చేశారు. వాళ్ల కుటుంబాలకు చేసిన మేళ్లు అన్నీ ఇన్నీ కావంటూ పాత చిట్టాను విప్పి చెబుతోంది. ‘‘బొత్సగారి కుటుంబానికి  వైఎస్సార్ త మేలు చేశారో.. ఆయన కుటుంబానికి ఎన్ని పదవులు ఇచ్చారో మీ అందరికీ తెలుసు. కానీ.. సత్తిబాబు గారికి విశ్వాసం లేదు.

రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ గారికైతే ఎంపీగా గెలుస్తారని ఆయనకే నమ్మకం లేదు. కానీ.. ఉండవల్లి గారిని వైఎస్సార్ ఒకసారి కాదు.. రెండుసార్లు ఎంపీని చేశారు. ఇప్పడు ఆయన జగన్ మోహన్ రెడ్డి మీద విషం గక్కుతున్నారు. మనిషి అన్నాక విశ్వాసం ఉండాలి. విలువలు.. విశ్వసనీయత ఉండాలి. ఇవి లేకపోతే మనిషికి.. మృగానికి తేడా లేదు’’ అంటూ షర్మిలమ్మ తిట్టిన తిట్లు.. ఆఖరికి చాలా కోపం వచ్చినప్పుడు కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ఉండరు.  కానీ.. పెద్దాయన చేత ఒక్క మాట అనిపించుకోని వారంతా.. వాళ్ల కళ్ల ముందు తిరిగిన పిల్లల చేత మనుషులు కాదు.. మృగాలు అనిపించుకోవాల్సిన దుస్థితి. ఎందుకలా అంటే.. చేసుకున్నోళ్లకు చేసుకున్నంత అన్నట్లు ఉందిప్పుడు పరిస్థితి. అప్పట్లో మా నాయన చాలా చేశారు.. చేశారు అంటున్న షర్మిలకు.. నాన్న ఎందుకు అంత చేశారు? అని అడిగేవారే కరువయ్యారు. అంటే పద్ధతి పాడు లేకుండా నాన్నకు ఇష్టం వచ్చినట్లు చేశారనే చెప్పదలుచుకుందా అన్నది ప్రశ్న. బొత్స కుటుంబానికి ఎన్ని పదవులు ఇచ్చామో అంటూ గొప్పగా చెప్పుకుంటున్న షర్మిలకు... అసలు ఒక కుటుంబానికి ఎందుకన్ని పదవులు అని అడిగింది లేదు? మనకు నచ్చకపోతే.. మనుషులు కాస్త పశువులు అయిపోరు. వాళ్లు ఎంతో చేసి పెట్టి ఉండకపోతే.. నాన్న మాత్రం ఎందుకు చేస్తారు షర్మిలమ్మ? నాన్న దగ్గర డబ్బులు లేకపోతే.. చాలా మంది వాళ్ల ఆస్తులు అమ్మి మరీ.. పార్టీ కోసం పెట్టుబడి పెట్టారమ్మ. అప్పట్లో మీరు రాజకీయాల్లోకి రాలేదు కాబట్టి చాలా విషయాలు తెలీవు. కావాలంటే.. కేవీపీ బాబాయ్ ని ఇదే ప్రశ్న అడుగు. ఆయన చెబుతారు చిట్టా. అయినా.. మా నాన్న మీకు చాలా చేశారు. వాటికి రెట్టింపు మీరు మాకు చేయాలని  అడుగుతున్న తీరు బహు ముచ్చటేస్తుంది. ఇంత డిమాండ్ చేసి మరీ పనులు చేయించుకునే తత్వం శభాష్. బహిరంగంగానే ఇంత చక్కగా బ్లాక్ మొయిల్ చేసే మీరు.. నాలుగు గోడల మధ్య మీతో వ్యవహారం అంటే చాలా జాగ్రత్తగా ఉండాలేమో. అందుకేనేమో... నాడు నాన్నతో పాటు నడిచిన వారంతా.. హోల్ సేల్ గా మీ నుంచి తప్పుకొని.. మీకు దూరంగా బతుకుతుంది అందుకేనా? అత్యాశకు నిలువెత్తు నిదర్శనమైన మీరు.. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవాల్సింది పోయి.. బ్లాక్ మొయిల్ తో బెదిరించటమా? చేతిలో అధికారం లేకపోతేనే ఇంతలా అంటున్నారే.. ఒకవేళ అధికారం మీ చేతిలో ఉంటే.. అమ్మో.. ఆలోచించాలంటే భయమేస్తుంది. మరి... మీరేమంటారు?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English