'వైఎస్‌ఆర్‌ - జగన్‌ = మచ్చలేని మనిషి’ అట!

'వైఎస్‌ఆర్‌ - జగన్‌ = మచ్చలేని మనిషి’ అట!

వైఎస్‌ రాజశేఖర రెడ్డి అంటే తమ పార్టీ ప్రాపర్టీ అని కాంగ్రెస్‌పార్టీ ఎంతగానైనా చెప్పుకోవచ్చు గాక...  ఆయన కుటుంబం ఇప్పుడు ఆ పార్టీలో లేకుండా.. సొంత పార్టీ పెట్టుకున్న సందర్భంలో వైఎస్‌ కుటుంబం మొత్తం రోడ్డెక్కి కాంగ్రెస్‌ పార్టీని తీవ్రస్థాయిలో దునుమాడుతున్న తరుణంలో.. వైఎస్‌ఆర్‌ అంటే వచ్చే క్రెడిట్‌ మొత్తం తమకే దక్కాలంటూ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆయన బొమ్మపై తమకు మాత్రమే పేటెంట్‌ ఉన్నట్లు ఉద్యమిస్తోంది.

అయితే వైఎస్సార్‌ బతికి ఉన్న రోజుల్లో ఆయనకు అత్యంత సన్నిహితుల్లో ఒకరుగా పేరున్న ఉండవల్లి అరుణ్‌కుమార్‌ మాత్రం.. వైఎస్సార్‌ను ఆయన కొడుకు జగన్‌ను వేర్వేరుగా చూస్తున్నారు. తనకు ఎంతోకాలంగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి తెలుసునని.. ఆయన జీవితం అంతా పోరాటాలు చేస్తూనే వచ్చారని... ఎన్నడూ అవినీతికి పాల్పడలేదని కితాబులు ఇచ్చారు. అయితే వైఎస్‌ సీఎం అయిన తర్వాత.. ఆయనను అడ్డుపెట్టుకుని జగన్‌ అక్రమంగా తన సొంత ఆస్తులు పెంచుకోవడం ప్రారంభం అయ్యాక మాత్రమే.. వైఎస్‌ మీద కూడా అవినీతి బురద మరకలు పడడం ప్రారంభం అయిందని ఉండవల్లి భాష్యం చెబుతున్నారు. వైఎస్‌ను అడ్డు పెట్టుకుని సకల అరాచకాలకు పాల్పడుతున్నది జగన్‌ మాత్రమేనని ఉండవల్లి అంటున్నారు.

వైఎస్‌ జగన్‌ విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడి తన ఆస్తులు పెంచుకున్నాడని.. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో భవంతి ఏర్పాటు చేసుకున్నాడని.. రెండు టెన్నిస్‌ కోర్టులు, హెలిపాడ్‌, స్విమ్మింగ్‌పూల్‌ ఇలాంటి భోగాలతో జగన్‌ ఇల్లు నిర్మించుకున్నాడని ఉండవల్లి చెప్పారు. ఇలాంటి వన్నీ సంపాదన ఎక్కువైన వారు ఎవ్వరైనా పెట్టుకోవచ్చు గానీ అలాంటి వారు.. ప్రజాసేవ అంటూ రాజకీయాల్లోకి మాత్రం రాకూడదని ఈ అక్రమాల సొమ్ముతో సేవ చేసేది ఏదీ ఉండదని ఉండవల్లి ఆరోపించారు.

జగన్‌ బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్న సందర్భంలో రాంజెఠ్మలానీ వాదనల్ని కూడా ఆయన ప్రస్తావించడం విశేషం. ఇందిరాగాంధీ హంతకుల తరఫున వాదించిన రాంజెఠ్మలానీ జగన్‌కోసం వాదనలకు వచ్చినప్పుడు... న్యాయస్థానం ముందు ‘ఒకవేళ జగన్‌ తప్పు చేసి ఉన్నా కూడా.. చాలా కాలం అయింది గనుక... బెయిలు ఇవ్వమని చెప్పారే తప్ప మరొకటి అడగలేదని ప్రస్తావించారు. జగన్‌ అక్రమాస్తుల గురించి అడిగితే ఆయనకు నోరు విప్పి చెప్పాల్సిన అవసరం లేదంటూ.. వాక్‌స్వాతంత్య్రంలో మౌనంగా  ఉండడం కూడా ఒక ప్రాథమిక హక్కు అంటూ జెఠ్మలానీ వాదించడాన్ని.. కూడా జగన్‌ అక్రమాలను కాపాడే ప్రయత్నంగానే .. తను కూడా సీనియర్‌ న్యాయవాది అయిన ఉండవల్లి అరుణ్‌కుమార్‌ వివరించి చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు