అప్పుడు ఇందిరాగాంధీ.. ఇప్పుడు రాహుల్ గాంధీ

అప్పుడు ఇందిరాగాంధీ.. ఇప్పుడు రాహుల్ గాంధీ

ఏఐసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మనవడు రాహుల్ గాంధీ శుక్రవారం నుంచి ఏపీలోని అనంతపురం జిల్లా ఓబులదేవరచెరువు గ్రామంలో పర్యటించబోతున్నారు. సరిగ్గా 36 ఏళ్ల కిందట 1979లో ఇందిరా గాంధీ ఇదే ఊరిలో పర్యటించడం విశేషం... ఇప్పుడు రాహుల్ కూడా నాన్నమ్మ పర్యటించిన ఊరిలోనే తానూ పర్యటిస్తున్నారు.  అంతేకాదు... అక్కడ ప్రసంగించబోతున్నారు కూడా. అయితే... రాహుల్ గాంధీ పర్యటనపై అధికార తెలుగుదేశం పార్టీతో పాటు ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీవ్రంగా మండిపడుతున్న నేపథ్యంలో ఆయన ఎంతవరకు ప్రభావం చూపించగలరన్నది చూడాలి.

రాహుల్ గాంధీ తన పర్యటనలో రైతులు, డ్వాక్రా మహిళల సమస్యలపై ప్రధానంగా ప్రస్తావిస్తారని భావిస్తున్నారు. అనంతపురం జిల్లాలో ఆయన పాదయాత్ర ఓబులదేవర చెరువు గ్రామం నుంచి ప్రారంభమవుతుంది. పది కిలోమీటర్ల పాటు సాగే పాదయాత్రలో ఆయన రైతులు, చేనేత కార్మికులు, విద్యార్థుల సమస్యలను తెలుసుకుంటారు. అయితే... రాష్ట్ర విభజనకు కాంగ్రెస్సే కారణమని... విభజనలో సీమాంధ్రకు నష్టం జరిగిందని, ఇందుకు రాహుల్ గాంధీ సమాధానం చెప్పిన తర్వాతనే అనంతపురం జిల్లాలో పర్యటించాలని తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల నాయకులు అంటున్నారు.  ఆయన తన పర్యటనలో, ప్రసంగాల్లో  ఏపీ  ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ వంటి అంశాలను లేవనెత్తుతారని భావిస్తున్నారు.

కాగా మాజీ సీఎం వైయస్ రాజశేఖర రెడ్డికి రాహుల్ గాంధీ నివాళులు అర్పించే కార్యక్రమాన్ని వైయస్సార్ పార్టీ తప్పు పడుతోంది. తెలుగుదేశం పార్టీతో కలిసి కాంగ్రెసు పార్టీ వైయస్ కుటుంబాన్ని కేసులతో వేధించిందని... అలాంటి కాంగ్రెస్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వైఎస్ కు నివాళులర్పిస్తుందని వారు నిలదీస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు