విజయమ్మ పాపం చాలా ట్రై చేస్తేనే...

విజయమ్మ పాపం చాలా ట్రై చేస్తేనే...

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిస్తేజంగా లేదని బాహ్యప్రపంచానికి కనిపించడం అనేది ఆ పార్టీ ముందున్న తొలి  ప్రాధాన్యం కింద ఇప్పుడు వారిని నడిపిస్తోంది. అందుకే ఒకవైపు చెల్లెమ్మ పాదయాత్రలో దూసుకుపోతుండగా..  అమ్మ జిల్లాజిల్లాకు కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ సాగుతున్నారు. అయితే.. ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా తమ పార్టీ చాలా కీలకంగా ఉండబోతున్నదని విజయమ్మ అందరికీ సంకేతాలు ఇవ్వదలచుకున్నట్లు ఉన్నారు. అందుకే ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రకటించిన మమతా బెనర్జీ స్వయంగా విజయమ్మకు ఫోన్‌ చేసి మాట్లాడినట్లు సాక్షి పత్రికలో ఒక వార్త వచ్చింది.

విజయమ్మకు ఫోన్‌ వచ్చిందని జగన్‌ గురించి ఆరా తీసిందని, కేసుల విచారణ వివరాలు అడిగిందనేది వార్త. కేంద్రంలో యూపీఏ/కాంగ్రెసు సర్కారుకు ఎదురొడ్డి ఒక ఫ్రంట్‌ ఏర్పాటు చేసేందుకు సిద్ధపడుతున్న మమత ఫోనుచేస్తే  నిజానికి అది పెద్ద వార్త కింద లెక్క. ఇక్కడ 33 సీట్లు గెలుస్తాం అని చెప్పుకుంటున్న వైకాపా.. కేంద్రంలో చాలా కీలక పార్టీ కావాలి. వారి లెక్క కరెక్టు అయి గెలిస్తే గనుక.. కేంద్రంలో ప్రభుత్వం ఎవరిదైనా వారు వైకాపా ను ఆశ్రయించాల్సిందే. అలాంటప్పుడు కాంగ్రెసుకు హెచ్చరిక ఇవ్వడానికైనా విజయమ్మకు మమత ఫోను అనే అంశాన్ని బాగా ప్రచారం చేసుకుని ఉండాల్సింది. కానీ అలా జరగలేదు. ఏదో నామమాత్రంగా ఒక మూల ప్రచురించారు.

అయితే పార్టీ నాయకుల ద్వారా తెలుస్తున్న సమాచారం ఏంటంటే.. మమత నుంచి ఫోను దానంతట అది రాలేదుట. ఆమె ఫెడరల్‌ ప్రకటన చేసినప్పటినుంచి విజయమ్మ తరఫు నుంచి మమతతో మాట్లాడడానికి అనేక ప్రయత్నాలు జరిగాయిట. ఒకవైపు ఫెడరల్‌ లో చక్రం తిప్పేది తానేనని చంద్రబాబు ప్రకటించుకోగా, ఫెడరల్‌ ఫ్రంట్‌తో తాను కూడా టచ్‌లోనే ఉన్నానంటూ కేసీఆర్‌ కూడా చాటుకున్న నేపథ్యంలో అసలు అందులో తమ ఉనికి కూడా ఉంచుకోవడం కోసం విజయమ్మ ` మమతతో మంతనాలు సాగించడానికి అనేక ప్రయత్నాలు చేయగా.. అవి ఇప్పటికి నెరవేరాయని.. ఆమె ఇప్పటికి ఫోను చేసి మాట్లాడిరదని నాయకులు చెబుతున్నారు. విజయమ్మకు ఈ ఆత్రుత ఎందుకో అర్థం కావడం లేదని నిజంగా తాము సీట్లే గెలిస్తే.. వారే తమ వద్దకు వస్తారు గానీ.. తాము వెంపర్లాడడం ఎందుకని పార్టీ వారే అనుకుంటున్నారు.