జూపూడీ వైఎస్‌ జయంతికి డబ్బుల్లేవా?

జూపూడీ వైఎస్‌ జయంతికి డబ్బుల్లేవా?

సోమవారం నాడు వైఎస్‌ రాజశేఖర రెడ్డి జయంతి. నిజానికి ఈ రోజున వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ జరిగి ఉండాల్సింది. సభా నిర్వహణకు సంబంధించి మొన్న మొన్నటి వరకు ఏర్పాట్లు చేసుకుంటూ వచ్చారు. అయితే.. చివరి నిమిషంలో తన పరోక్షంలో పార్టీ కి సంబంధించి పెద్ద కార్యక్రమాలు నిర్వహించడం.. తన అవసరాన్ని తక్కువ చేసస్తుందనే ఉద్దేశంతోనూ, సభే జరిగితే గనుక పార్టీలోని అంతర్గత విభేదాలు.. విచ్చలవిడిగా బయట పడిపోతాయనే భయంతో కావచ్చు. మొత్తానికి జగన్‌ ప్లీనరీకి ఎర్రజెండా చూపించడం జరిగింది. ఈ కారణాన్ని జనం నమ్ముతారు గానీ.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వారి వద్ద డబ్బుల్లేవని.. అందువల్లనే పాపం.. ప్లీనరీ కూడా నిర్వహించుకోలేని స్థితిలో ఉన్నారని చెబితే ఎవరైనా నమ్ముతారా? నవ్వుతారు!!

కానీ ఆ పార్టీ నాయకుడు జూపూడి ప్రభాకరరావు చెబుతున్న దీనమైన మాటలు వింటే.. అయ్యో పాపం అనిపిస్తుంది. ఆయన తమ వద్ద డబ్బుల్లేవని అనడం లేదుగానీ.. తమ పార్టీ నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని నిర్వహించాల్సిందిగా కాంగ్రెసు నాయకులకు పిలుపు ఇస్తున్నాడు. వైఎస్సార్‌ అంటే ఆయన మా  ప్రాపర్టీ అని చెప్పుకునే కాంగ్రెసు పార్టీ.. వారు ఆయన మీద నిజంగా భక్తి ఉంటే గనుక.. ఆయన జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని జూపూడి హితవు చెబుతున్నారు.

బాగానే ఉంది. జూపూడి మాటలు సబబే. కానీ సీఎల్పీ గాంధీభవన్లో నాయకులు ఆఫ్‌ ది రికార్డుగా తమ ఆంతరంగిక సంభాషణల్లో ఏం చెబుతున్నారంటే.. ‘అవును మా ప్రాపర్టీ గనుక మేం ఆయన జయంతిని కావలిస్తే నిర్వహిస్తాం.. కానీ అలా నిర్వహించమని డిమాండ్‌ చేసేముందు ఆయన మా ప్రాపర్టీ మాత్రమే అని మీరు ఒప్పుకుంటారా.. ఒప్పుకుంటే.. ఆయన ఫోటోను మీ జెండాలోంచి తీసేసే దమ్ముందా?’ అని ప్రశ్నిస్తున్నారు. బహుశా తన సవాలు ఇలా బ్యాక్‌ఫైర్‌ అవుతుందని జూపూడి ఊహించకపోయి ఉండొచ్చు. కొందరు కాంగ్రెస్‌ నాయకులు అయితే.. ఏం వైకాపా వారి వద్ద వాళ్ల మహానేత జయంతి చేసుకోవడానిక్కూడా డబ్బుల్లేవా.. ఆ ఉత్సవాల్ని మమ్మల్ని చేయమంటూ దేబిరించడం ఎందుకు అంటూ వెక్కిరిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు