విందు కూడా ఇవ్వొద్దంటారా షబ్బీర్

విందు కూడా ఇవ్వొద్దంటారా షబ్బీర్

తెలంగాణ కాంగ్రెస్ నేతల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. పార్టీకి పెద్ద పెద్ద ఫిల్లర్లుగా భావించిన నేతలంతా ఒకరి తర్వాత ఒకరు పెట్టా.. బేడా సర్దుకొని తెలంగాణ అధికారపక్షంలోకి వెళ్లిపోవటం మొదలపెట్టటం ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.

తమ పార్టీని సంక్షోభంలో పడేయాలన్న ఆలోచనలో ఉన్న కేసీఆర్ ను ఏదో రకంగా విమర్శించాలన్న తొందర్లో మరిన్ని తప్పులు చేస్తున్నారు. ఇప్పటివరకు ఏ తెలుగు ముఖ్యమంత్రి చేయలేనంత సాహసాన్ని కేసీఆర్ చేశారని చెప్పాలి. రంజాన్ సందర్భంగా మైనార్టీలపై వరాల వర్షం కురిపించారు. ఇంత భారీగా వరాలు కురిపించే ధైర్యం ఏ ముఖ్యమంత్రి చేయరు.

కేసీఆర్ నోటి నుంచి ఈ రేంజ్ వరాలు ఊహించని తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. ఒక్కసారి గళం విప్పారు. ఈ వరాల జల్లును విభేధిస్తూ.. షబ్బీర్ అలీ మండిపడుతున్నారు. ముస్లింలు రిజర్వేషన్లు కోరుకుంటుంటే.. ఇఫ్తారు విందులు ఇస్తారా? అంటూ నిలదీస్తున్నరు. గ్రేటర్ ఎన్నికల్లో ముస్లిం ఓట్లను ఆకర్షించేందుకే ఇలాంటి విందులు అని మండిపడుతున్నారు.

ఎన్నికల సందర్భంగా ముస్లింలకు ఇస్తామన్న 12 శాతం రిజర్వేషన్ల హామీ ఎక్కడికి వెళ్లిందని ప్రశ్నిస్తున్నారు. చూస్తుంటే.. మైనార్టీలకు విందులు.. వరాలు కూడా ఇవ్వొద్దన్నట్లుగా వారి మాట ఉందన్నట్లుగా ఉంది వ్యవహారం. రిజర్వేషన్ల లాంటి పెద్ద విషయాన్ని ఇచ్చే వరకూ మైనార్టీలకు మరెలాంటి వరాలు ఇవ్వకూడదని షబ్బీర్ కోరుకుంటున్నారా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏదోలా మాట్లాడాలన్న తొందర కంటే కూడా.. కాస్త ఆలోచించి మాట్లాడితే బాగుంటుందేమో షబ్బీర్ సాబ్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు