చిరు లక్ష్యం కాదు, అభిమానుల కోరిక

చిరు లక్ష్యం కాదు, అభిమానుల కోరిక

'ముఖ్యమంత్రి కావాలన్నది నా లక్ష్యం కాదు, అది అభిమానుల కోరిక' అని చిరంజీవి మనసులో ఉద్దేశ్యాన్ని తెలివిగా, రాజకీయ చాణక్యంతో బయటపెట్టారు. ముఖ్యమంత్రి అవ్వాలనే ఉద్దేశ్యంతోనే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. అంతే తప్ప, కాంగ్రెసు పార్టీలో దాన్ని కలిపి, తద్వారా కేంద్ర మంత్రి పదవి సంపాదించాలని కాదు కదా. కేంద్ర మంత్రే అవ్వాలనుకుంటే కాంగ్రెసులో చేరి దాసరి నారాయణరావులా తేలిగ్గానే చిరంజీవి ఆ పదవి పొందేవారు.

అనుకున్నదొక్కటి, అయ్యింది ఒక్కటి అన్నట్టుగా ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల్లో చతికిలపడేసరికి, కాంగ్రెసులో తన పార్టీని చిరంజీవి విలీనం చెయ్యాల్సి వచ్చింది. ఇప్పుడాయనకు కాంగ్రెసు బలం తోడయ్యి, కాంగ్రెసు నేతలు కూడా చిరంజీవి జపం చేసే పరిస్థితి కనిపిస్తున్నది. 2014 ఎన్నికల్లో చిరంజీవి కాంగ్రెసు పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారని మంత్రి రామచంద్రయ్య అనగా, దానిని ఖండించకుండా అందులో తప్పేముందని కాంగ్రెసు వారు అనాల్సి వస్తున్నది.

చిరంజీవితో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఇంకో మంత్రి రఘువీరారెడ్డి ప్రత్యేకంగా భేటీ అయి, ఆయన సీఎం అవుతారనే పుకార్లకు 'ఎనర్జీ' ఇచ్చారు. దాంతో చిరంజీవి స్పందించక తప్పలేదు. అభిమానుల కోరిక నెరవేర్చడానికే చిరంజీవి కాంగ్రెసులో తన గ్రూపుని బలోపేతం చేశారని అనుకోవాల్సి ఉంటుంది ఆయన మాటల్ని వింటే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు