జగన్ భయ్యా జైల్లోనేనా ఉన్నది..

జగన్ భయ్యా జైల్లోనేనా ఉన్నది..

ఒక్కో టైంలో ఒక్కొరి హవా నడిచి పోతుంది. ఇంట్లో ఉన్నారా.. చంచలగూడ జైల్లో ఉన్నారన్నది అనవసరం. కోరుకున్న  సౌకర్యాలు అలా ముందుకొచ్చి వాలిపోతుంటాయి. అందుకు జగన్ భయ్యా మినహాయింపేమీ కాదు. ఆ మాటకొస్తే చంచలగూడ జైల్లో ఉన్న అత్యంత ధనిక ఖైదీ ఆయనే అని చెప్పాలి. చంచలగూడ జైలు ఏంటి ఖర్మ. దేశంలోని జైళ్లల్లో ఉన్న నిందితులు..శిక్షల పడ్డ వారితో పోల్చినప్పుడు కూడా జగన్ బాబుది తిరుగులేని రికార్డు. ఆ విషయంలో ఎలాంటి డౌటు అక్కర్లేదు.

జనరల్ గా ఆలోచించండి... ఒక కేసు విచారణలో ఉన్న  ఖైదీని కలుసుకునేందుకు ఎంత మంది పొలిటీషియన్స్ వెళతారు. పది.. లేదంటే పాతిక. కాదంటే యాభై అంతకు మించి ఎక్కువ ఆలోచించటం కష్టం. కానీ.. అదేంటో కానీ జగన్ బాబుకు హైదరాబాద్ లో ఉన్న అధికారిక సొంతిల్లు లోటస్ పాండ్లో ఉంటే ఎలా వెళ్లి కలుస్తారో కానీ... విజిటర్స్ తాకిడి ఎక్కువగా ఉంది. ఎంతైనా..రేపు కాకపోయినా.. మాపైనా ముఖ్యమంత్రి కావాల్సిన ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి. జగన్ సారు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఆయన్ను కలవటానికి వచ్చే వారి విషయంలో జైలు అధికారులు తమకున్న విచక్షణాధికారంతో ఎంతమందిని కలవాలో డిసైడ్ చేస్తారు. మన ఖర్మ బాగోక జైల్లో ఉండాల్సి వస్తే.. వారంలోనో.. నెలలో ఒకసారి కలిసేందుకు అనుమతిస్తారు. దానికి ఎంత తతంగం ఉంటుందో. కానీ..జగన్ భయ్యాను కలవటానికి 133మంది రాజకీయనాయకులు చంచలగూడ జైలు దగ్గర క్యూ కడితే.. అధికారులు కూడా సరేనని అనుమతిచ్చారు. కాదన్న వాళ్ల లిస్ట్ కనుక సేకరించే అవకాశం ఉంటే..ఆ సంఖ్య ఏమైనా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో ఎక్కేందుకు అవకాశం మొండుగా ఉన్నట్లు కనిపిస్తోంది.

ఆ మధ్య తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణకు ఒక డౌటు వచ్చింది. చంచలగూడ జైలు అధికారుల కాల్ లిస్ట్ డేటా కావాలని. దాని కోసం దరఖాస్తు చేసే జవాబు వచ్చింది. కాకపోతే.. కాల్ లిస్ట్ అడిగితే.. ఎంత ఖర్చు పెట్టారో దానికి సంబంధించిన బిల్లులు ఇచ్చారు. టీడీపీ వాళ్లకు వచ్చిన డౌట్లను ఆరోపణలుగా చేస్తే.. ‘‘పిచ్చ పిచ్చగా ఉంది. మాపై అభాండాలు మోపుతారా? ఇలానే చేసుకుంటూ పోయారంటే మీ మీద పరువునష్టం దావా వేస్తాం’’ అంటూ బెదిరించేసరికి.. తెలుగు తమ్ముళ్లు భయపడిపోయారు. అసలే తొమ్మిదిన్నరేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న ఆ పార్టీకి ఉండే ఇబ్బందులు కూడా తక్కువేం కాదు. దానికి తోడు ఇదొకటా అని కాస్త వెనక్కి తగ్గారు. అయినా ప్రజాస్వామ్యంలో ఏదైనా సందేహం వచ్చి దానికి సంబంధించిన సమాచారం కోసం సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేస్తే సమాధానం రావాలి కదా. కానీ.. జగన్ బాబు ఉన్న జైలుకు సంబంధించిన వివరాలపై దరఖాస్తు చేస్తే.. ఆన్సర్స్ కన్నా వార్నింగ్స్ ఎక్కువ వస్తున్నాయట.

ఇవన్నీ చూసినప్పుడు జగన్ భయ్యా ఉందసలు జైల్లోనేనా అన్న డౌటు వస్తుంది కదా. ఎంత మాట.. అలా ఏమైనా అనిపిస్తే మనసులో మెల్లగా అనుకోవాలే తప్ప బయటకు సందేహాలు వ్యక్తం చేస్తే.. లేనిపోని సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. అయినా.. ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ కోరితే.. వెంటనే వేసేయటానికి మనమేమీ సత్యకాలంలో బతకటం లేదు కదా. మీరూ కాస్త అర్థం చేసుకోండి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు