రేవంత్ అల్లుడేం చేస్తుంటాడు..?

రేవంత్ అల్లుడేం చేస్తుంటాడు..?

ఓటుకు నోటు కేసులో కెమేరా కంటికి చిక్కి అడ్డంగా ప్రస్తుతం జైల్లో ఉన్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డికి సంబంధించి వార్తలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఆయన కుమార్తె నిశ్చితార్థం గురువారం ఎన్ కన్వెన్షన్ లో జరగటం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొనటం కోసం కోర్టు రేవంత్ కు ప్రత్యేకంగా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

ఈ పెళ్లికి సంబంధించి ఆసక్తికరమైనఅంశాలు చాలానే ఉన్నాయి. రేవంత్ రెడ్డికి కాబోయే అల్లుడు ఆంధ్రా ప్రాంతానికి చెందిన అబ్బాయి కావటం ఒక విశేషం. అబ్బాయి పేరు సత్యనారాయణ రెడ్డి. పశ్చిమగోదావరిజిల్లా భీమవరం ప్రాంతానికి చెందిన ఈ వరుడు..అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి సొంతూరు వచ్చేశాడు. తండ్రి చేస్తున్న వ్యాపారాల్ని దగ్గరుండి తానే చూసుకుంటున్నాడు.

ఇక.. రేవంత్ కుమార్తె నైమిష చదువంతా హైదరాబాద్ లో సాగింది. ఇంటర్ వరకూ నాజర్ స్కూల్లో చదివిన నైమిష.. బేగంపేట సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో డిగ్రీ  పూర్తి చేసింది. ఇక.. వివాహం విషయానికి వస్తే.. రెండు కుటుంబాలు కూర్చొని ఒక తేదీని డిసైడ్ చేస్తాయని చెబుతున్నారు.

ఇక.. నిశ్చితార్థం విషయానికి వస్తే.. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ అదినేత.. సీఎం చంద్రబాబుతో సహా.. పార్టీకి చెందిన మంత్రులు.. ఏపీ అసెంబ్లీ స్పీకర్ తో సహా.. పోలీసు ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే (సుధీర్ రెడ్డి).. ఇటీవల ఎన్నికైన ఎమ్మెల్సీ (యాదవ రెడ్డి) కూడా ఈ వేడుకకు హాజరయ్యరు. వీరిద్దరూ రేవంత్ రెడ్డికి బంధువులు.

కొసమెరుపు ఏమిటంటే.. ఈ వేడుకలకు హాజరైన పలువురి అతిధుల ఫోన్లకు ఒక ఎస్ఎంఎస్ రౌండ్లు తిరిగిందని చెబుతున్నారు. రెడ్లను లక్ష్యంగా చేసుకొని అటు.. ఆంధ్రాలోనూ.. ఇటు తెలంగాణలోనూ రాజకీయ దాడులు పెరుగుతున్నాయన్న ఆందోళన వ్యక్తమైందట. ఏపీ ముఖ్యమంత్రి కుటుంబ సమేతంగా హాజరైన వేడుకలో ఇలాంటి ఎస్ఎంఎస్ వైరల్ కావటమేమిటో..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు