ఏపీలో ఎక్కడ చూసినా కేసీఆరే

ఏపీలో ఎక్కడ చూసినా కేసీఆరే

కేసుల రాజ‌కీయాన్ని ఏపీ అధికార‌ప‌క్షం తెర‌పైకి తీసుకొచ్చింది. ఓటుకు నోటు వ్య‌వ‌హారంలో వీడియో.. ఆడియో టేపులు విడుద‌లై రాజ‌కీయంగా సంచ‌ల‌నం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఉదంతంలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ఏసీబీ నోటీసులు ఇవ్వొచ్చ‌ని.. విచార‌ణ జ‌ర‌పొచ్చ‌న్న వాద‌న‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. సీమాంధ్ర‌లో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై ఏపీకి చెందిన ప‌లు ప్రాంతాల్లో కేసులు న‌మోదయ్యాయి. ఏపీ సీఎం చంద్ర‌బాబును అప్ర‌దిష్ఠ పాలు చేసేందుకు తెలంగాణ సీఎం ప్ర‌య‌త్నిస్తున్నార‌న్న ఆరోప‌ణ‌పై ప‌లు పోలీస్‌స్టేష‌న్ల‌లో ఫిర్యాదులు.. దాని వెంట‌నే కేసులు న‌మోదయ్యాయి.

శ్రీ‌కాకుళం నుంచి.. చిత్తూరు వ‌ర‌కూ రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు ప్రాంతాల్లో తెలంగాణ సీఎంపై కేసులు న‌మోదు చేశారు. వాస్త‌వానికి ఇలాంటి వ్య‌వ‌హారాలు తెలంగాణ ప్రాంతంలో చాలా ఎక్కువ‌గా చోటు చేసుకుంటుంటాయి. ఏదైనా ఘ‌ట‌న జ‌రిగితే దానికి వ్య‌తిరేకంగా ప‌లు పోలీస్ స్టేష‌న్ల‌లో కేసులు న‌మోదు కావ‌టం.. కోర్టుల‌కు ఎక్క‌టం లాంటివి. తాజాగా.. సీమాంధ్ర‌లోనూ ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితే చోటు చేసుకోవ‌టం గ‌మ‌నార్హం.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే..కొన్నిచోట్ల పెట్టిన కేసుల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో పాటు.. టీఆర్ ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌స‌న్ తో పాటు.. ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌.. ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ పేరు కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు