నాయుడుగారు ఇంకెన్ని భరించాలో

నాయుడుగారు ఇంకెన్ని భరించాలో

ఒక్కోసారి సీనియర్ నాయకులు, బాధ్యత గల వ్యక్తులకు ఆ స్థానం వల్లే మా చెడ్డ చిరాకు వచ్చే పరిస్థితి ఎదురవుతుంది. వాళ్ల మీద నమ్మకం పెట్టుకున్నవారికి అవి నెరవేర్చకపోవడంతో చిరాకు పడటం..విమర్శ చేయడం పరిపాటిగా మారుతుంది. పోని నెరవేరుద్దామని ప్రయత్నం చేద్దామన్నా...సదరు వ్యక్తుల ముందున్న పెద్ద తలకాయలు అడ్డుపడుతుంటాయి. సరిగ్గా ఇలాంటి పరిస్థితినే కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఎదుర్కుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది అక్కడి ప్రజానికానికి అత్యంత ముఖ్య విషయంగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీలో అగ్రనేతగా ఉన్న వెంకయ్యపై నమ్మకం, గతంలో ఆయన ఇచ్చిన హామీలు గుర్తుకురావడం సహజం. అయితే ప్రత్యేక హోదా కల నెరవేరడం లేదు కాబట్టి వెంకయ్యే వైఫల్యం చెందారంటున్నారు సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు నారాయణ. రాష్ట్రానికి ప్రత్యే హోదా ఇవ్వడంలో కేంద్రం మీనమేషాలు లెక్కిస్తోందని విమర్శించారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా కల్పిస్తామన్న ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడా ఊసే ఎత్తడంలేదని అన్నారు. ఏపీ ప్రత్యేక హోదా కల్పిస్తామన్న హామీని నిలబెట్టుకుంటానన్న వెంకయ్యనాయుడు నెల్లూరు బొమ్మిడాయి చేపలా జారిపోతున్నారని నారయణ ఎద్దేవా చేశారు. అలా తన నాన్ వెజ్ ప్రేమను చాటుకున్నారు.

పనిలో పనిగా..ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై కూడా ఓ రాయి వేసేశారు నారాయణ వారు. టీడీపీ ప్రభుత్వం ఏం సాధించిందని వార్షికోత్సవ సంబరాలు జరుపుకుంటున్నారని ఆయన చంద్రబాబును నిలదీశారు. రుణమాఫీ పూర్తిగా చేయనేలేదని, డ్వాక్రా రుణాల సంగతే మర్చిపోయారని.. ఏపీకి ప్రత్యేక హోదా సాధించడంలోనూ సీఎంగా ఉన్న బాబు ఫెయిలయ్యారని ఆరోపించారు. మొత్తంగా తనదైన మార్కులో కేంద్ర మంత్రి, రాష్ర్ట ముఖ్యమంత్రిపై అక్కసు తీర్చుకున్నారు నారాయణ.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు