ఏం సవాల్ కేటీఆర్

ఏం సవాల్ కేటీఆర్

హైదరాబాద్ వేదికగా పార్టీలు, రాజకీయ నేతల మధ్య వాడి-వేడి కొనసాగుతోంది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు రూ.50లక్షలు ఇస్తూ రేవంత్ రెడ్డి పట్టుబడిన వీడియో బయటకు రావడం తెలిసిందే. అది జరిగిన వారం తర్వాత ఆ డీల్ లో చంద్రబాబుకూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని ఆయన మాటలతో కూడిన ఆడియో టేపు ఒకటి విడుదల అయింది. ఈ రెండు రాజకీయాల్లో పెద్ద సంచలనం సృష్టించాయి. దీనికి తోడు అన్నట్లుగా...ఓ ఎమ్మెల్యేను కొనేందుకు తెలంగాణ మంత్రి కేటీఆర్ రూ.3 కోట్లు ఆఫర్ చేసినట్లు ఒక చానల్ ఆడియో టేపులను విడుదల చేసింది. ఈ ఉదంతంలో ఓ డీఎస్పీ కూడా సహకరించారని పేర్కొంది. కేటీఆర్ తోనే ఇదంతా జరిగిందని ఆ టేపులను బట్టి తేలుతోందని ప్రస్తావించగా...అందుకు తగ్గట్లు టీడీపీ నేతలు కేటీఆర్ హస్తం ఉందని విమర్శలు చేశారు.

ఈ నేపథ్యంలో దీనిపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలకు టీవీ ఎదుట లైడిటక్టర్ పరీక్షలు చేయించుకోవడానికి సిద్ధం అని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధమా అని కేటీఆర్ సవాల్ విసిరారు. ఈ మేరకు తన ట్విట్టర్ అకౌంట్ లో ఈ సవాల్ ను పోస్ట్ చేశారు. ప్రస్తుతం నడుస్తున్నది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సమస్య కాదని ఆయన స్పష్టం చేశారు. రెండు రాష్ర్టాల మధ్య సమస్య అన్నట్లుగా సృష్టించే ప్రయత్నం చంద్రబాబు, ఆయన మనుషులు చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు, టీడీపీ అవినీతి పనులు బట్టబయలు అయ్యాయని కేటీఆర్ పేర్కొన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే తన సవాల్ ను స్వీకరించాలని డిమాండ్ చేశారు.

ఈ ఆడియో వీడియో టేపుల యుద్ధం సవాల్ ల స్థాయికి చేరుకొని ఆ తదనంతరం ఇంకెక్కడికి దారితీస్తుందో చూడాలి మరి.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు