యావంతా ప్ర‌చారం మీదే..

యావంతా ప్ర‌చారం మీదే..

కాసుల మీద ఉన్న మోజు..  ప్ర‌జ‌ల ఆరోగ్యాల మీద ఏమాత్రం ఉండ‌వ‌న్న విష‌యం మ‌రోసారి నిరూపిత‌మైంది. కాసుల కోసం ప్ర‌చారం మీద చూపించే శ్ర‌ద్ధ‌.. ఆ వ‌స్తువు త‌యారీ మీద దృష్టి పెడితే.. రెండు నిమిషాల మ్యాగీకి ఇప్పుడు వ‌చ్చిన క‌ష్టాలు వ‌చ్చి ఉండేవి కావేమో. ఆరోగ్యాన్ని దెబ్బ తీసే ర‌సాయ‌నాలు.. సీసం మోతాదు ఎక్కువ‌న్న విష‌యం ప‌లు చోట్ల నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో వెల్ల‌డైన విష‌యం తెలిసిందే.

ప‌లు రాష్ట్రాల్లో మ్యాగీ అమ్మ‌కాల‌పై నిషేధం విధించారు. ఈ స‌మ‌యంలోనే ఒక ఆస‌క్తిక‌ర స‌మాచారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. తాము ఉత్ప‌త్తి చేసే వ‌స్తువు నాణ్య‌త ప‌ట్ల మ్యాగీ ఉత్ప‌త్తిదారుల‌కు ఎంత శ్ర‌ద్ధ ఉంద‌న్న విష‌యం.. స‌ద‌రు కంపెనీ వార్షిక నివేదిక‌ల్ని చూస్తే ఇట్టే అర్థ‌మైపోయే ప‌రిస్థితి.

మ్యాగీని అమ్ముకోవ‌టానికి 2014లో ఆ కంపెనీ ఏడాదిలో ఏకంగా రూ.445కోట్లు ఖ‌ర్చు చేసింది. అదే స‌మ‌యంలో.. మ్యాగీ నాణ్య‌తను ప‌రీక్షించేందుకు కేటాయించిన మొత్తం కేవ‌లం రూ.19కోట్లు మాత్ర‌మే. ఇదొక్క ఏడాదిలోనే కాదు.. గ‌తంలోనూ ఇలాంటి విధానాన్నే మ్యాగీ అనుస‌రించిన‌ట్లు తేలింది.

2010లో మ్యాగీ త‌న ఉత్ప‌త్తి ప్ర‌చారం కోసం రూ.302కోట్లు ఖ‌ర్చు చేయ‌గా.. మ్యాగీ నాణ్య‌త‌ను ప‌రీక్షించేందుకు పెట్టిన ఖ‌ర్చు కేవ‌లం రూ.13కోట్లు మాత్ర‌మే. ప్ర‌క‌ట‌న‌ల మీద చూపించే శ్ర‌ద్ధ‌.. వ‌స్తువు నాణ్య‌త మీద చూపించి ఉంటే.. మ్యాగీకి ఇంత క‌ష్టం వ‌చ్చేది కాదేమో.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు