ఆపరేషన్‌ బ్లాక్‌మెయిల్‌!

ఆపరేషన్‌ బ్లాక్‌మెయిల్‌!

చంద్రబాబు నాయుడిది ఆపరేషన్‌ కరెన్సీ! వైఎస్‌ రాజశేఖర రెడ్డిది ఆపరేషన్‌ ఆకర్ష్‌! చంద్రశేఖర రావుది ఆపరేషన్‌ బ్లాక్‌మెయిల్‌! ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి ఆకర్షించడంలో ముగ్గురిదీ మూడు రకాల విధానాలు! ప్రపంచంలో ఎవరినైనా డబ్బుతో కొనవచ్చనేది చంద్రబాబు నాయుడు విధానం అయితే, ప్రలోభాలతో ఎవరినైనా లంగదీయవచ్చనేది వైఎస్‌ రాజశేఖర రెడ్డి విశ్వాసం. రాజకీయాల్లో ప్రతి ఒక్కడికీ లోపాలు ఉంటాయి.. ఇప్పటికే వివిధ మార్గాల్లో వాడు అక్రమ మార్గాల్లో డబ్బులు దండుకుంటూ ఉంటాడు. వాడికి ఇంకా డబ్బులు ఇచ్చి పార్టీల్లోకి చేర్చుకోవడం ఏమిటి..? వాడి లూప్‌హోల్స్‌ తెలుసుకుని బ్లాక్‌మెయిల్‌ చేస్తే చచ్చినట్లు వాడే పార్టీలోకి వస్తాడనేది కేసీఆర్‌ విధానం అని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.

రేవంత్‌ రెడ్డి ఘటనను ఉదాహరణగా చూపి ఇప్పుడు మిగిలిన ఎమ్మెల్యేలను బ్లాక్‌మెయిల్‌ చేసి టీఆర్‌ఎస్‌లోకి రప్పించడానికి కేసీఆర్‌ పావులు కదిపారని అంటున్నారు. మదర్‌ డెయిరీ చైర్మన్‌, ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి తమ్ముడు గుత్తా జితేందర్‌ రెడ్డిని ఈ విధంగానే పార్టీలోకి ఆహ్వానించారని చెబుతున్నారు. మదర్‌ డెయిరీకి గతంలో సుఖేందర్‌ రెడ్డి, ఆ తర్వాత జితేందర్‌ రెడ్డి చైర్మన్లుగా ఉన్నారు. ఇప్పుడు జితేందర్‌ రెడ్డి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన పదవీ కాలంలో మరో ఏడాది ఉంది. ఈ నేపథ్యంలోనే మదర్‌ డెయిరీలోని అక్రమాలపై ప్రభుత్వం విచారణ జరిపిస్తోందంటూ సంకేతాలు పంపారు. అంతే.. జితేందర్‌ రెడ్డితోపాటు పలువురు టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు.

టీడీపీలో ఇంకా ఊగిసలాడుతున్న ఎమ్మెల్యేలను కూడా ఆపరేషన్‌ బ్లాక్‌మెయిల్‌ ప్రయోగిస్తున్నారు. రేవంత్‌ తరహాలో ఏదో ఒక కేసులో జైలుకు వెళతారా? టీఆర్‌ఎస్‌లోకి వచ్చి హాయిగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుని నాలుగు డబ్బులు వెనకేసుకుంటారా? అని నేరుగానే ప్రశ్నిస్తున్నారు. టీఆర్‌ఎస్‌లోకి వస్తే రాజకీయంగా బతికి ఉంటారని, జైలుకు వెళితే రాజకీయంగా కూడా చస్తారని బెదిరిస్తున్నారు. దాంతో మరికొద్ది రోజుల్లోనే మరికొంతమంది టీడీపీ నేతలు టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని సమాచారం.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు