వైసీపీలో బొత్స ఉండేది కొన్నాళ్లేనా!?

వైసీపీలో బొత్స ఉండేది కొన్నాళ్లేనా!?

కాపురం చేసే కళ కాలి గోళ్లనాడే తెలుస్తుందని తెలుగులో సామెత. ఇప్పుడు ఈ సామెత ప్రకారం వైసీపీలో చేరిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఆ పార్టీలో ఉండేది కొద్ది కాలమేనని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇందుకు పార్టీలో చేరినప్పుడు ఆయన ముఖ కవళికలను నిదర్శనంగా చూపుతున్నారు.

ఆదివారం ఉదయం బత్స కుటుంబానికి వైసీపీ అధినేత జగన్‌ పార్టీ కండువాలు కప్పి వైసీపీ తీర్థం ఇచ్చారు. ఈ సందర్భంగా జగన్‌ కృత్రిమ నవ్వును నవ్వుతూనే ఉన్నారు. పార్టీ కండువా కప్పి బొత్సను ఆలింగనం చేసుకోవడానికి ప్రయత్నించారు. పార్టీ కండువా కప్పినప్పుడు కానీ, జగన్‌ ఆలింగనం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు కానీ బొత్సలో చిరునవ్వు మచ్చుకు కూడా కనిపించలేదు. సరికదా, ఆలింగనం చేసుకోవడానికి చేతులు చాస్తే ముఖం కాస్త చిరాగ్గా పెట్టారని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. జగన్‌ పార్టీలో చేరుతున్నప్పుడు ఏమాత్రం తగ్గి ఉన్నట్లు కాకుండా తన ఆధిపత్యాన్ని చాటుకున్నట్లుగానే బొత్స వ్యవహార శైలి ఉందని గుర్తు చేస్తున్నారు. వాస్తవానికి, ఈ వ్యవహార శైలి జగన్‌కు అస్సలు పడదని విశ్లేషకులు వివరిస్తున్నారు.

ఇంకా చెప్పాలంటే, రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో కాంగ్రెస్‌ అనాథ కంటే దారుణంగా మారిపోయింది. ప్రతిపక్షంలో ఉంటే అయినా అధికారులు ఎంతో కొంత మర్యాద ఇస్తున్నారు. కానీ, కాంగ్రెస్‌ నాయకులను పూచికపుల్ల తీసిపారేసినట్లు పారేస్తున్నారు. దాంతో విజయనగరం జిల్లాలో తన అనుచరులను కాపాడుకోవడంతోపాటు తన పరువును కాపాడుకోవడం బొత్సకు అత్యంత కీలకంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఏదో ఒక పదవి ఉంటే తప్పితే మళ్లీ తన గౌరవం తనకు రాదని ఆయన భావించారు. కాంగ్రెస్‌లో ఉంటే ఇప్పట్లో కోలుకునే పరిస్తితి లేదని గుర్తించే వైసీపీలోకి వెళ్లారు. అక్కడ ఎమ్మెల్సీ పదవితోపాటు శాసన మండలిలో ప్రతిపక్ష నేత పదవి ఇస్తామని చెప్పారు కనక ఆయన అందులోకి వెళ్లారు.

అయితే, పార్టీలో తన ఆధిపత్యం ఉండాలని జగన్‌ భావిస్తారు. తన ఆధిపత్యానికి ఏమాత్రం తగ్గినా బత్స ఊరుకోరు. ఈ విషయం కండువాల రోజునే స్పష్టమైంది. అతి త్వరలోనే ఇది బహిరంగం కానుందని విశ్లేషకులు వివరిస్తున్నారు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు