చంద్రబాబు చాణక్యం!!

చంద్రబాబు చాణక్యం!!

ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్‌ ఇరుక్కుపోవడం.. ఆ తర్వాత ఇప్పుడు చంద్రబాబును కూడా ఇరికించేలా కేసీఆర్‌ ప్రభుత్వం పావులు కదుపుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తన చాణక్యం ప్రదర్శించారు. ఇప్పుడు కేసీఆర్‌పైనే ఎదురు దాడి చేసేలా పావులు కదుపుతున్నారు. ఇందుకు కేసీఆర్‌ ప్రభుత్వంలోని మంత్రులే అవకాశం ఇవ్వడం విశేషం.

చంద్రబాబు ఒక ఎమ్మెల్యేతో మాట్లాడారని, దానికి సంబంధించిన సమాచారం తమ దగ్గర ఉందని, ఆ వివరాలు బయట పెడతామని నాయిని నర్సింహారెడ్డి వ్యాఖ్యానించారు. వాస్తవానికి, నాయిని వ్యాఖ్యలతో అంతా చంద్రబాబు స్టీఫెన్సన్‌తో మాట్లాడారని భావించారు. కానీ, స్టీఫెన్సన్‌తో కాకుండా టీఆర్‌ఎస్‌కు చెందిన ఇతర ఎమ్మెల్యేలతో చంద్రబాబు మాట్లాడారని, ఆ వివరాలు బయట పెడతామని నాయిని మాటల్లోని అంతరార్థమని విశ్లేషకులు వివరిస్తున్నారు. ఆ విషయం తెలియడంతో చంద్రబాబు ఎదురు దాడికి శ్రీకారం చుట్టారు. తాను ఎమ్మెల్యేలతో మాట్లాడిన విషయాలను రహస్యంగా ట్యాపింగ్‌ చేసి ఇప్పుడు బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని ఎదురు దాడి చేస్తున్నారు.

వాస్తవానికి, హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉంది. పదేళ్లపాటు రెండు ప్రభుత్వాలూ సామరస్యంగా సాగాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఏపీ ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారుల ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం ట్యాపింగ్‌ చేయడం పెను వివాదంగా మారనుంది. ఇది రాష్ట్ర విభజన చట్టాన్ని ఉల్లంఘించడం కూడా అవుతుంది. తద్వారా ఈ వివాదం కేంద్రానికి చేరుతుంది. కేసీఆర్‌ ప్రభుత్వం ఇరుకునపడుతుంది. దాంతో, ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ఇరికించడమో.. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో కేంద్రంలో పరువు పోగొట్టుకోవడమో తేల్చుకోవాల్సిన పరిస్థితి కేసీఆర్‌కు ఏర్పడుతుందని భావిస్తున్నారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ రూపంలో చంద్రబాబు నాయుడు ఇప్పుడు మరో ఎత్తు వేశారు. హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఇక్కడ శాంతి భద్రతలు గవర్నర్‌ పరిధిలోనే ఉండాలి. కానీ, అందుకు తెలంగాణ నానా యాగీ చేసి శాంతి భద్రతలను తమ అదుపులోనే ఉంచుకుంది. ఇప్పుడు వాటిని మళ్లీ గవర్నర్‌ చేతికి అప్పగించాలని చంద్రబాబు పావులు కదుపుతున్నారు. అందుకు ఫోన్‌ ట్యాపింగ్‌ను అస్త్రంగా చేసుకుంటున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై కేంద్రానికి ఫిర్యాదు చేసి రాబోయే పదేళ్లపాటు శాంతి భద్రతలను గవర్నర్‌ చేతికి అప్పగించాలని, ఆ తర్వాత గవర్నర్‌ను మార్చాలని కసరత్తు చేస్తున్నారు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు