ప్రపంచాన్ని అమరావతికి రప్పిస్తా: చంద్రబాబు

ప్రపంచాన్ని అమరావతికి రప్పిస్తా: చంద్రబాబు

ఇప్పటిదాకా సీమాంధ్ర జనాలు హైదరాబాద్‌కు వెళ్లారని.. విదేశాలకూ వెళ్లారని.. ఐతే అమరావతి పేరుతో ప్రపంచస్థాయి రాజధానిని నిర్మించి.. ప్రపంచమంతా ఇక్కడికి వచ్చేలా చేస్తానని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచమంతా సింగపూర్‌ గురించి మాట్లాడుకుంటోందని, భవిష్యత్తులో అమరావతిని గురించి ఇలాగే చెప్పుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదని చంద్రబాబు అన్నారు.

తాను హైదరాబాద్‌ను అద్భుతంగా తీర్చిదిద్దానని.. ఇప్పుడు అమరావతిని కూడా అలాగే తయారు చేస్తానని చంద్రబాబు అన్నారు. ప్రపంచంలో ఎక్కడా కూడా భూసేకరణ ఇంత సాఫీగా సాగలేదని.. ఈ విషయంలో రైతులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చంద్రబాబు చెప్పారు. యూపీఏ ప్రభుత్వం విభజన విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసిందని.. రాష్ట్రాన్ని దిక్కులేని స్థితికి చేర్చిందని.. ఐతే రాజధాని కోసం భూమి ఇచ్చిన రైతులు తనలో ఎంతో విశ్వాసం కల్పించారని అన్నారు.

రాజధాని విషయంలో చాలామంది రాజకీయాలు చేశారని.. అన్నా హజారె లాంటి వాళ్లకు తప్పుడు సంకేతాలిచ్చి ప్రకటనలు చేయించారని.. ఐతే వాళ్లది దుష్ప్రచారమని రైతులు చాటిచెప్పారని.. స్వచ్ఛందంగా భూములు ఇచ్చి సహకరించడం తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేనని చంద్రబాబు చెప్పారు. ఈ ఏడాది 15 వేల కోట్ల లోటు బడ్జెట్‌ ఉందని.. కేంద్రం సాయం చేయాల్సి ఉందని.. పరిమితికి మించి అప్పులు చేసే పరిస్థితి కూడా లేదని.. ఇలాంటి సమయంలో అటు ప్రభుత్వానికి, ఇటు రైతులకు ఉభయతారకంగా ఉండేలా భూసేకరణ జరిగిందని.. భూములిచ్చిన రైతులు అద్భుతంగా అభివృద్ధి చెందేలా రాజధానిని నిర్మిస్తానని చంద్రబాబు చెప్పారు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు