సినిమా రివ్యూ: పండగ చేస్కో

సినిమా రివ్యూ: పండగ చేస్కో

సినిమా రివ్యూ: పండగ చేస్కో
రేటింగ్‌: 2.75/5
తారాగణం: రామ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సోనాల్‌ చౌహాన్‌, బ్రహ్మానందం తదితరులు
సంగీతం: థమన్‌
కెమెరా: సమీర్‌రెడ్డి
ఎడిటర్‌: గౌతరరాజు
నిర్మాత: పరుచూరి కిరీటి
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోపీచంద్‌ మలినేని

టైటిల్‌ దగ్గర్నుంచి ట్రెయిలర్ల వరకు పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ అనే నమ్మకాన్ని కలిగించిన 'పండగ చేస్కో'లో కామెడీకి లోటు ఉండదనిపించింది. కోన వెంకట్‌ ఈ చిత్రానికి రచన చేయడం, బలుపు, డాన్‌శీను చిత్రాలతో ఇలాంటి సినిమాలని తీయడంలో తనకి నేర్పు ఉందనిపించుకున్న గోపీచంద్‌ మలినేని దర్శకుడు కావడంతో పండగ చేస్కో ఒకింత అంచనాలు రేకెత్తించింది. ప్రస్తుతం బ్యాడ్‌ టైమ్‌ నడుస్తోన్న రామ్‌కి మళ్లీ గుడ్‌ టైమ్‌ స్టార్ట్‌ అయ్యేలా ఈ చిత్రం చేస్తుందో లేదో చూద్దాం.  

కథ:

తన కంపెనీ మూత పడిందని తెలిసి కార్తీక్‌ (రామ్‌) ఇండియాకి వస్తాడు. ఒక సోషల్‌ యాక్టివిస్ట్‌ అయిన దివ్య (రకుల్‌ప్రీత్‌సింగ్‌) తన కంపెనీ క్లోజ్‌ అవడానికి కారణమని తెలియడంతో ఆమెని కన్విన్స్‌ చేద్దామని చూస్తాడు. తనకి అనుష్క (సోనాల్‌ చౌహాన్‌) అనే మరో అమ్మాయితో నిశ్చితార్ధం జరిగినా కానీ దివ్యని ప్రేమించడానికి కూడా సిద్ధపడ్తాడు. అయితే కార్తీక్‌ వచ్చిన కారణం కంపెనీ కోసం కాదని, విడిపోయిన తన కుటుంబాన్ని కలపడానికని తర్వాత తెలుస్తుంది.

కథనం:    

ఏదైనా ఒక జోకు ఒకసారి పేలిందని మళ్లీ మళ్లీ దానినే వినిపిస్తే కొన్నాళ్లకి చిరాకొస్తుంది. ఢీ, రెడీ నుంచి బాద్షా వరకు ఒకటే ఫార్ములాని తిప్పి తిప్పి తీసిన శ్రీను వైట్లకి ఆగడుతో దెబ్బ తగిలింది. అయితే కోన వెంకట్‌కి మాత్రం లౌక్యం కూడా సక్సెస్‌ ఇచ్చింది. దాంతో తన ఫార్ములాకి ఇంకా నూకలు చెల్లిపోలేదనుకుని మళ్లీ ఇంకోసారి దానిని వాడేసాడు. 'పండగ చేస్కో' సినిమాలో కొత్తదనం మచ్చుకైనా కానరాదు.

తెలుగు సినిమాలంటే ఇలాగే ఉంటాయి, మన ప్రేక్షకులు ఇలాంటివే ఇష్టపడుతున్నారు కనుక మేమివే రాస్తాం, ఇలాగే తీస్తామన్నట్టు అదే పనిగా రుద్దుతున్నారు. వేరే భాషల్లో కొత్తదనం కోసం దర్శకులు బుర్రలు బాదుకుంటూ ఉంటే తెలుగు సినిమాలు మాత్రం అదే మూసలో పడి నస పెడుతున్నాయి. సక్సెస్‌లో లేని హీరోలు కామెడీని నమ్ముకుంటే గండం గట్టెక్కిపోవచ్చునని, పడిపోతున్న మార్కెట్‌ని తిరిగి నిలబెట్టుకోవచ్చని అనుకుంటున్నారు. అలాగే కొత్తదనం కోసం ప్రయత్నిస్తే వచ్చే అవకాశాల్ని కూడా పోగొట్టుకుంటామోనని దర్శకులు భయపడుతున్నారు.

ఫలితంగా కొంత కాలంగా తెలుగు తెరపై ఒకే కథ సర్కిట్లు కొడుతోంది. ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురి చేయడానికో, వారికి తెలియనిది చూపించడానికో ఆలోచించే రోజులు ఏనాడో పోయాయి. ప్రాస కోసం పాకులాడుతూ డైలాగులు రాసేయడం, నవ్వించడానికి నలభై రకాలుగా పాట్లు పడి పాస్‌ అయిపోవవాలని చూడడమే జరుగుతోంది. పండగ చేస్కో చిత్రం మూల కథ తీసుకుంటే ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుందని అన్నయ్యలు ఆమెని ద్వేషిస్తూ కూర్చుంటారు. ఆమె కొడుకు వచ్చి ఇప్పుడు వాళ్లని కలుపుతాడు. ఏ కాలం నాటి కథ ఇది?

కథ ఏదైనా కానీ ద్వితీయార్థంలో హీరోతో సహా అందరూ ఒక ఇంట్లో చేరిపోయి కామెడీ చేయడమే రెడీ నుంచీ తెలుగు సినిమాని పీడిస్తోన్న హిట్‌ ఫార్ములా. చెరుకుగడని మూడు నాలుగు సార్లు మిషన్‌లో పెడితే చివర్లో కాసిని డ్రాప్స్‌ వస్తాయేమో. ఆ తర్వాత మిగిలేది పిప్పి. ఆ పిప్పిని కూడా క్యాష్‌ చేసుకునే ప్రయత్నమే ఈ పండగ చేస్కో. టైటిల్‌ జస్టిఫికేషన్‌ కోసం చివర్లో ఒకసారి టైటిల్‌ చెప్పించేవారు ముప్పయ్‌ ఏళ్ల క్రితం. ఇందులోను అదే చేసారంటే అంత అడ్వాన్స్‌డ్‌ సినిమా అని అర్థం.

నటీనటులు:

రామ్‌ అంటేనే ఎనర్జీ. ఇందులో అందంగా కనిపించాడు. బాగా నటించాడు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పాత్రకి తీరుతెన్నులు లేకపోయినా బాగానే చేసింది. సోనాల్‌ చౌహాన్‌ నటన ఆకట్టుకుంటుంది. బ్రహ్మానందం ఇప్పటికి ఎన్నో సినిమాల్లో చేసిన పాత్రనే చేసినా నవ్వించగలిగాడు. సాయికుమార్‌ నటన డిగ్నిఫైడ్‌గా ఉంది. సంపత్‌ రాజ్‌ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. వెన్నెల కిషోర్‌, ఎమ్మెస్‌ నారాయణ, రఘుబాబు తదితరులు కామెడీ కోసం ఉపయోగపడ్డారు. భార్య గురించి ద్వందార్థ సంభాషణలతో ఎమ్మెస్‌ చేసే కామెడీ మాస్‌ని ఆట్టుకుంటుంది.

సాంకేతికవర్గం:

గోపీచంద్‌ మలినేనికి కామెడీ సినిమాలు తీయడంపై కమాండ్‌ ఉంది. మామూలుగా తన సినిమాల్ని పక్కా ఫార్ములాకి తగ్గట్టు మలిచే మలినేని ఈసారి గాడి తప్పాడు. పాటెప్పుడు వస్తుంది, ఫైటెప్పుడు వస్తుంది, తర్వాత ఏమి జరుగుతుంది ఇలా అన్నీ చెప్పేయడానికి వీలుండే విధంగా కథనం రాసుకుని, ఆ బలహీనతని దర్శకుడిగా కవర్‌ చేయలేకపోయాడు. గుర్తుండిపోయే పాటలు లేవు. నేపథ్య సంగీతం పర్వాలేదు. సంభాషణల్లో కొన్ని నవ్విస్తాయి. ఛాయాగ్రహణం బాగుంది. ఎడిటింగ్‌ ఆకట్టుకోదు.

చివరిగా...

రొటీన్‌గా ఉన్నా కామెడీ సీన్లుంటే చాలనుకుంటే తప్ప పండగ చేస్కో ఏమాత్రం టైటిల్‌కి తగ్గ సినిమా కాదు. బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రం గట్టెక్కడంలో ఆ కామెడీనే ప్రధాన పాత్ర పోషించాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English