క్రిష్ తో సినిమా అంటే కష్టమా!

క్రిష్ తో సినిమా అంటే కష్టమా!

ఎంత తోడినా తరగని టాలెంట్ ఉంది. ఎంతటి కష్టమైన సబ్జెక్ట్ ని అయినా డీల్ చేసే సత్తా ఉంది. కాకపోతే కాస్త సామాజిక స్పృహ ఎక్కువయ్యింది. అదే క్రిష్ ని దెబ్బేస్తోందనేది కొందరి వాదన. తొలి సినిమా గమ్యంతో తనేంటో చూపించేశాడు క్రిష్. అతడిలో ఎవరికీ లేని విషయమేదో ఉందని అందరూ ఫిక్సయిపోయారు. ఆ తర్వాత వేదం, కృష్ణం వందే జగద్దురుం తీశాడు. వాటిని చూశాక అతడిలో ఉన్న విషయమేమిటో అందరికీ తెలిసి పోయింది.

 అతడికి సమాజం మీద శ్రద్ధ ఎక్కువ. సామాజిక బాధ్యత ఎక్కువ. సమస్యలను వెలికి తీసి, పరిష్కారాన్ని చూపాలన్న తపన ఎక్కువ. అయితే ఇవన్నీ కలిసి అతడితో మూస సినిమాలు తీయిస్తున్నాయా? అవునంటున్న వాళ్లే ఎక్కువ. ఎంతసేపూ మంచే చెబుతానంటే ఎవరు చూస్తారు! కాస్త ఎంటర్ టైన్ మెంట్ కూడా కావాలనే కదా సినిమాకి వస్తారు. క్రిష్ సినిమాల్లో అది మిస్ అవుతోంది. అందుకే అతడి సినిమా అంటే ఏదో ఆర్ట్ సినిమా టైపులో చూస్తున్నారంతా.

అవి కచ్చితంగా గొప్ప సినిమాలే. కానీ అందరికీ ఎక్కేవి కావు. అందుకే అతడితో సినిమా తీయడానికి నిర్మాతలు కూడా కాస్త ముందూ వెనుకాడుతున్నారు. క్రిష్ తో సినిమా అనగానే కాస్త ఆలోచించాలి అని నిర్మాతలు సంశయిస్తున్నారని సమాచారం. మహేశ్ బాబుతో శివమ్ తీయడానికి రంగం సిద్ధమై చాలా కాలమయ్యింది. అది కూడా ఇంతవరకూ సెట్స్ మీదికి వెళ్లలేదు. మహేశ్ బాబు బిజగా ఉన్నాడని, అతడు ఎప్పుడంటే అప్పుడే మొదలు పెడతానని క్రిష్ చెబుతున్నాడు. టాప్ పొజిషన్ కి వెళ్లడానికి తపన పడాల్సిన సమయంలో ఇలా రిలాక్సవుతుంటే... క్రిష్ ఎప్పటికైనా స్టార్ డైరెక్టర్ అవుతాడంటారా!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు