సినిమా రివ్యూ: అవును 2

సినిమా రివ్యూ: అవును 2

సినిమా రివ్యూ: అవును 2
రేటింగ్‌: 2.5/5
తారాగణం: పూర్ణ, హర్షవర్ధన్‌ తదితరులు
సంగీతం: శేఖర్‌ చంద్ర
కెమెరా: సుధాకర్‌రెడ్డి
ఎడిటర్‌: మార్తాండ్‌ కె వెంకటేష్‌
నిర్మాత: సురేష్‌
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రవిబాబు

గత అయిదారేళ్లలో తెలుగులో వచ్చిన ఉత్తమ హారర్‌ చిత్రాల్లో అవును ముందు వరుసలో ఉంటుంది. ఒరిజినల్‌ ఐడియాతో, ఉత్కంఠభరిత కథనంతో రవిబాబు కట్టిపడేసాడు. ఒంటరిగా ఇంట్లో ఉండాలంటే భయపడేలా అది చూసిన వాళ్లని కొంతకాలం ఆ చిత్రం వెంటాడేలా చేసాడు. దానికి సీక్వెల్‌ అంటే సహజంగానే ఆసక్తి కలుగుతుంది. తన సినిమాల్ని మార్కెట్‌ చేసుకోవడంలో మాస్టర్‌ అయిన రవిబాబు 'అవును 2' చిత్రానికి ఒక ట్రెయిలర్‌ చేసాడు. సినిమాలోని సన్నివేశాలని తీసుకుని ట్రెయిలర్స్‌ చేస్తారు. కానీ సినిమాలో లేని దానిని చూపించి అవును 2 ట్రెయిలర్‌తో భయభ్రాంతులకి గురి చేసాడు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి. మిస్‌ కాకుండా చూడాలనే అనుభూతికి లోను చేసింది. కానీ అవును 2 చూస్తే నిరాశ పడక తప్పదు. ఎన్నో ఆశలు రేపిన రవిబాబు ఈ చిత్రాన్ని కేవలం ఒక 'కామ పిశాచి' కథలా మార్చి పడేసాడు.

కథ:

హర్ష, పూర్ణ అప్పటి పరిస్థితుల నుంచి కోలుకుని వేరే ఇంటికి మారతారు. కానీ వారిని ఆ ఆత్మ వెంటాడుతుంది. పూర్ణని ఎలాగైనా లోబరచుకోవాలని చూస్తుంటుంది. కానీ దైవశక్తితో దానిని నిలువరించగలుగుతుంది పూర్ణ. కానీ అదెంతసేపు? పూర్ణని లోబర్చుకోడానికి ఆ ఆత్మ ఏం చేస్తుంది?

కథనం:

ఫస్ట్‌ పార్ట్‌లో ఉన్నట్టుగానే ఇందులోను ఒక ఆకర్షణీయమైన ఇంటీరియర్‌ ఉన్న ఇల్లు, అందులో అనుక్షణం హీరోయిన్ని వెంటాడే దెయ్యం వగైరా ఉన్నాయి. కాకపోతే ఆ దెయ్యం ఎవరు, దాని మోటివ్‌ ఏంటి అనేది మొదటి భాగంలోనే తెలిసిపోయింది కాబట్టి ఇక మళ్లీ పూర్ణ కోసం వేచి చూసే ధోరణి లేకుండా ఆమెని సొంతం చేసుకునే ప్రయత్నాలతో ఈ చిత్రం మొదలవుతుంది. హీరోయిన్‌ని రేప్‌ చేయడం ఒక్కటే మోటివ్‌ కావడంతో ఇందులో హారర్‌ కంటే ఆ యాంగిలే ఎక్కువ డామినేట్‌ చేసింది.

దెయ్యం సీన్లోకి ఎంటరైనా కానీ ఉత్కంఠత లేదా భయం కలిగించకపోవడం డైరెక్షన్‌ లోపమే. ఇది ప్రధానంగా హారర్‌ సినిమా అనే విషయాన్ని రవిబాబు విస్మరించాడు. హీరోయిన్‌ దుస్తులు తొలగించే ప్రయత్నం చేయడం, ఆమె స్నానం చేస్తుంటే బాత్రూమ్‌లోకి వెళ్లడం వంటి సీన్లతో ఈ సాఫ్ట్‌ పోర్న్‌ చిత్రాన్ని తలపిస్తుంది. అవును చిత్రంలో కూడా దెయ్యం ఇంటెన్షన్‌ ఇదే అయినా కానీ దాంట్లో ఇదంతా శృతి మించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఐతే ఈ చిత్రంలో హారర్‌ ఎలిమెంట్‌ మిస్‌ అవడంతో దానిని కవర్‌ చేసుకునే ఉద్దేశంతో సెక్స్‌ ఎలిమెంట్‌ని పెంచినట్టున్నారు.

ఫస్ట్‌ హాఫ్‌లో కంటే సెకండ్‌ హాఫ్‌లో అంతో ఇంతో ఇన్‌వాల్వ్‌ చేసే సీన్లున్నాయి. కానీ ఒక పాయింట్‌కి వచ్చేసరికి ఇందులో విషయం లేదనే సంగతి తెలిసిపోతుంది. హీరోయిన్‌ ఏదో దైవ శక్తి ఉన్న లాకెట్‌ వేసుకుంటే ఆమెని దెయ్యం ఏం చేయలేదని అంటారు. కానీ అది ఆ లాకెట్‌ చూసే వరకు ఏం కావాలంటే అది చేసేయగలుగుతూ ఉంటుంది. ఇందులో ఏమాత్రం లాజిక్‌ లేదు. అలాగే ఆమె భర్తలోకి ప్రవేశించినప్పుడు అయినా ఆ ఆత్మ నెమ్మదిగా తనకి కావాల్సింది చేసుకోవచ్చు. ఐతే తెలివితక్కువ దెయ్యంలా ఆమెపైకి ఎగబడిపోతుంది.

సంబంధం లేని సన్నివేశాలతో పాటు, సిల్లీగా అనిపించే ఘోస్ట్‌ బస్టర్‌ విన్యాసాలు వగైరా కలిసి ఈ చిత్రాన్ని కలగాపులగం చేసేసాయి. దానికి తోడు ప్రతి నటుడూ అతిగా నటించేస్తూ దర్శకుడికి అస్సలు కంట్రోల్‌ లేదనే విషయాన్ని తెలియజెప్తుంటారు. రవిబాబు తీసిన చెత్త చిత్రాల కేటగిరీలోకి ఇది కూడా చేరుతుంది.

నటీనటులు:

పూర్ణ బాగానే నటించింది. ఆమె నటనని హైలైట్‌ చేయడం కంటే కెమెరా ఎప్పుడూ ఆమె అందచందాలని కవర్‌ చేసే పనిలో ఉన్నట్టనిపిస్తుంది. హర్షవర్ధన్‌ యావరేజ్‌ నటుడు. అతని లిమిటేషన్స్‌కి లోబడి నటించాడు. రవివర్మ బాగా నస పెట్టాడు. చక్రవర్తి కూడా అంతే. నిఖిత ఫర్వాలేదు. భార్గవికి ఎక్కువ సీన్‌ ఇవ్వలేదు. సంజన పాత్ర బిల్డప్‌కే తప్ప ఎఫెక్టివ్‌గా లేదు.

సాంకేతికవర్గం:

పాటల్లేని ఈ చిత్రంలో నేపథ్య సంగీతం హోరెత్తించింది. కెమెరా ట్రిక్కులు కూడా అదే పనిగా రిపీట్‌ అవుతాయి. అవునులో ఆకట్టుకున్న స్టాటిక్‌ కెమెరా టెక్నిక్‌ ఇందులో రక్తి కట్టలేదు. ఎడిటింగ్‌ కూడా అంతంత మాత్రంగానే ఉంది. అతి తక్కువ నిడివి ఉన్న చిత్రమైనా కానీ బాగా విసిగించిందంటే రవిబాబునే తప్పుపట్టాలి. ఉత్కంఠభరితమైన కథనంతో ఆకట్టుకోవాల్సిన కథతో రవిబాబు దర్శకుడిగా పూర్తిగా ఫెయిలయ్యాడు. బలహీనమైన స్క్రిప్ట్‌ పట్టుకుని అతనేం చేయలేకపోయాడు.

చివరిగా...

అవునులాంటి అనుభూతిని ఆశిస్తే ఈ సీక్వెల్‌ డిజప్పాయింట్‌ చేస్తుంది. ఈ చిత్రం చూడాలనుకుంటే డీవిడి వచ్చే వరకు వేచి చూడొచ్చు. అంతగా చూడాలనుకుంటే అవును ఇంకోసారి చూసి ఎంజాయ్‌ చేయవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు