బ్యాంకులకు పొంచి ఉన్న డేంజర్ చెప్పిన దువ్వూరి

కరోనా వేళ.. దేశీయ బ్యాంకులు ఎదుర్కొనే ముప్పు గురించి ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు తెలుగోడు.. ఆర్ బీఐ మాజీ గవర్నర్ గా పని చేసిన దువ్వూరి సుబ్బారావు. బ్యాంకులకు మొండి బకాయిలు పెరిగిపోవటమే కాదు.. రానున్న రోజుల్లో ఇదో పెద్ద సమస్యగా మారుతుందన్న విషయాన్ని ఆయన హెచ్చరిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్యాంకులకు పెరుగుతున్న మొండి బాకీల్ని తగ్గించేందుకు బ్యాడ్ బ్యాంకును ఏర్పాటు చేయాలన్న సూచనను చేస్తున్నారు.

మొండి బాకీల్ని పరిష్కరించే విషయంలో మామూలు బ్యాంకు కంటే కూడా బ్యాడ్ బ్యాంకు బాగా పని చేస్తుందని చెప్పారు. చెప్పామంటే చెప్పటం అన్నట్లు కాకుండా.. ఉదాహరణను కూడా చెప్పుకొచ్చారు. ఇదే తరహా ప్రయోగాన్ని ఇప్పటికే కొన్ని దేశాలు అమలు చేస్తున్నాయని.. అందుకు మలేషియాలోని దనహర్త ఆఫ్ మలేషియా చక్కటి ఉదాహరణగా ఆయన చెబుతున్నారు.

దేశంలో బ్యాడ్ బ్యాంకును రూపొందించటానికి ఆ సంస్థను అధ్యయనం చేస్తే మంచిదన్నారు. ఈ విధానంలో అన్ని బ్యాంకుల్లోని మొండి బకాయిల్ని బ్యాడ్ బ్యాంకుకు తరలిస్తారు. వాటి లెక్క తేల్చటమే ఈ బ్యాంకు చేసే పనిగా చెప్పారు. కరోనా వేళ.. మొండి బకాయిలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ ఏడాదిలో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల కారణంగా బ్యాంకులకు మొండి బాకీలు అనూహ్యంగా పెరుగుతాయన్న అంచనాను ఆయన వెల్లడించారు.

ఈ ఏడాది మార్చి నాటికి దేశీయంగా బ్యాంకుల్లో మొండి బకాయిలు 8.5 శాతం ఉంటే.. వచ్చే ఏడాది మార్చి నాటికి ఇవి కాస్తా 12.5 శాతంగా మారతాయని చెప్పారు. ఈ నేపథ్యంలో మొండి బకాయిల విషయంలో మరింత ఎఫెక్టివ్ గా పని చేసేందుకు వీలుగా.. దువ్వూరి వారు చెప్పిన బ్యాడ్ బ్యాంకు ఏర్పాటుపై మోడీ సర్కారు ఆలోచన చేస్తే మంచిదేమో?