థియేట‌ర్లు వేల‌ల్లో మూత‌

మార్చిలో తొలిసారి లాక్ డౌన్ ప్ర‌క‌టించి.. అన్ని ర‌కాల దుకాణాల‌తో పాటు థియేట‌ర్లను కూడా మూత వేసిన‌పుడు కొన్ని వారాలే క‌దా ఈ ఇబ్బంది అనుకున్నాయి యాజ‌మాన్యాలు. కానీ అలాగే నెల‌లు గ‌డిచిపోయాయి. రెండు నెల‌ల త‌ర్వాత లాక్ డౌన్ ష‌ర‌తుల‌ను స‌డ‌లిస్తూ వివిధ ర‌కాల వ్యాపారాల‌కు అనుమ‌తులిచ్చారు.

వైన్ షాపులు తెరిచారు. అన్ని ర‌కాల దుకాణాల‌కు అనుమ‌తులిచ్చారు. చివ‌రికి క‌రోనా వ్యాప్తి అధికంగా ఉండే జిమ్‌లు కూడా తెరుచుకునే సౌల‌భ్యం క‌ల్పించారు. కానీ థియేట‌ర్ల‌కు మాత్రం మోక్షం క‌ల్పించ‌లేదు. ఆరు నెల‌లుగా ఇవి మూత‌ప‌డే ఉన్నాయి. వ‌చ్చే నెల‌లో థియేట‌ర్ల‌కు అనుమ‌తులిస్తార‌ని వార్త‌లొస్తున్నాయి.

ఐతే థియేట‌ర్లు తెరుచుకున్న‌ప్ప‌టికీ వాటిని న‌డ‌ప‌డం కొన్ని నెల‌ల పాటు సామాన్య‌మైన విషయం కాదు. స‌గం సీట్ల‌నే ఫిల్ చేయాలి. షో షోకూ శానిటైజ్ చేయాలి. నేరుగా టికెట్లు అమ్మ‌కూడ‌దు. ఆన్ లైన్ ద్వారానే అమ్మ‌కాలు జ‌ర‌పాలి. క్యాంటీన్ల విష‌యంలో ష‌ర‌తులుంటాయి. థ‌ర్మ‌ల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలి. ఇన్ని చేసినా రెవెన్యూ మాత్రం ఆశించిన స్థాయిలో ఉండ‌వు. మునుప‌టిలా థియేట‌ర్లు న‌డ‌వ‌డానికి ఎన్ని నెల‌లు ప‌డుతుందో తెలియ‌దు. మ‌ల్టీప్లెక్సులైతే ఇవ‌న్నీ క‌చ్చితంగా పాటిస్తాయి. వాటి పెట్టుబ‌డి, రాబ‌డి ఎక్కువ‌. వాటి యాజ‌మాన్యాల బ‌లం గురించీ తెలిసిందే.

భ‌విష్య‌త్తును దృష్టిలో ఉంచుకుని అవి ఇప్పుడు న‌ష్టాలు భ‌రిస్తున్నాయి. ఇంకా కొన్ని నెల‌లు భ‌రిస్తాయి. కానీ సింగిల్ స్క్రీన్లు ఇప్ప‌టికే ఆరు నెల‌లుగా మూత‌ప‌డి భారీ న‌ష్టాల పాల‌య్యాయి. ఇక ముందూ కొన్ని నెల‌లు వాటి నిర్వ‌హ‌ణ చాలా క‌ష్టంగా ఉంటుంది.

ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం అనుమ‌తులిచ్చినా చాలా థియేట‌ర్లు తెరుచుకునే అవ‌కాశం లేద‌ని.. దేశ‌వ్యాప్తంగా వేలాదిగా సింగిల్ స్క్రీన్ల‌ను ఇప్ప‌టికే మూసేసే ప‌రిస్థితి ఉంద‌ని.. అస‌లే క‌ష్టంగా న‌డుస్తున్న థియేట‌ర్ల ఇండ‌స్ట్రీ క‌రోనా దెబ్బ‌కు పూర్తిగా కుదేలైంద‌ని.. ఈ నేప‌థ్యంలో సింగిల్ స్క్రీన్ల‌ను క‌ళ్యాణ మండ‌పాలుగానో, గోడౌన్లుగానో మార్చేసే యోచ‌న‌లో యజ‌మానులు ఉన్నార‌ని ఎగ్జిబిట‌ర్ వ‌ర్గాలు అంటున్నాయి.