మే నెలాఖరుకు దేశంలో 4 కోట్ల మొబైళ్లు మటాష్?

కరోనా తీసుకొస్తున్న కష్టాలు అన్ని ఇన్ని కావు. తమ జీవితకాలంలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని కలలో కూడా ఊహించని ఎన్నో సమస్యలు ఇప్పుడు చుట్టుముడుతున్నాయి. ఇదే తరహాలో ఇప్పుడు మరో ముప్పు పొంచి ఉందని చెబుతున్నారు. చేతిలో మొబైల్ ఫోన్లు లేని జీవితాన్ని ఊహించలేం.

స్మార్ట్ ఫోన్ రంగ ప్రవేశంతో లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది. కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఎదురైన వేళలో జనాలకు బోర్ కొట్టకుండా అంతో ఇంతో టైం పాస్ అంటే మొబైల్ ఫోన్ తోనే అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

అలాంటి మొబైల్ ఫోన్లకు ముప్పు ఉన్న విషయం ఒకటి బయటకు వచ్చింది. దేశంలో ఇప్పుడున్నట్లే లాక్ డౌన్ కంటిన్యూ అయితే.. దేశంలో మొబైల్ ఫోన్లు వినియోగిస్తున్న వారిలో నాలుగు కోట్ల మంది చేతుల్లో ఉండే ఫోన్లు మే నెలాఖరుకు కనిపించకపోవచ్చని చెబుతోంది ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్.

హ్యాండ్ సెట్లలో తలెత్తే లోపాలు.. బ్రేక్ డౌన్ వల్ల అవి వాడే పరిస్థితులు ఉండకపోవచ్చని చెబుతోంది. ఫోన్లు.. వాటి విడి భాగాల విక్రమాల మీద ఇప్పుడున్న ఆంక్షలు కంటిన్యూ అయితే.. కోట్లాది ఫోన్లు పని చేయకపోవచ్చని చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ సాగుతున్న వేళలో ప్రస్తుతం 2.5 కోట్ల మందికి పైనే వినియోగదారుల ఫోన్లు వాడకానికి వీల్లేని రీతిలో ఉన్నాయని చెబుతున్నారు.

దేశంలో ప్రస్తుతం 85 కోట్ల మొబైల్ ఫోన్లు ఉన్నాయని.. సరాసరిన నెలకు 2.5 కోట్ల మొబైల్ ఫోన్ల అమ్మకాలు ఉంటాయని చెబుతున్నారు. అదే పనిగా వాడకంతో పాటు.. వాటిలో తలెల్తే సాంకేతిక సమస్యల పరిష్కారానికి షాపులు మూసి ఉండటం కారణం ఫోన్లు పని చేయని పరిస్థితులు అంతకంతకూ పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఎందుకైనా మంచిది లాక్ డౌన్ ముగిసే వరకూ మీ ఫోన్ ను కాస్త జాగ్రత్తగా వాడండి.