పేర్లు కరువయ్యాయా పూరీ!

పేర్లు కరువయ్యాయా పూరీ!

హీరోలను బాగా లాంచ్ చేస్తాడని పూరీకి పేరు. అందుకే రామ్ చరణ్ తేజను అతడి చేతిలో పెట్టాడు చిరంజీవి. అవకాశం దొరకిందే తడవుగా 'చిరుత' అంటూ సీన్లోకి వచ్చేశాడు పూరీ జగన్నాథ్. ఆ సినిమా సక్సెస్ కావడంతో ఇప్పడు నాగబాబు కూడా తన కొడుకుని పూరీ చేతిలో పెట్టేశాడు. అశ్వినీదత్ కూడా భారీగా ఖర్చు చేయడానికి సిద్ధపడటంతో మెగా పిల్లాడు వరుణ్ తేజ ఎంట్రీ మోగిపోతుందని అంతా ఫిక్సయిపోయారు. పూరీ జగన్ అయితే, మెగా ఫ్యామిలీ తన మీద ఉంచిన నమ్మకాన్ని ఎలాగైనా నిలబెట్టేసుకోవాలని తెగ కసరత్తులు చేస్తున్నాడు. అసలే ఈ మధ్య టైమ్ కాస్త బ్యాడ్ అయ్యింది కదా! ఆ పరిస్థితిని మార్చుకుని మళ్లీ పాత కళను తెచ్చుకోవాలంటే, అతడికిదే అద్భుతమైన అవకాశం. అందుకేనేమో, దీన్ని లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ గా తీసుకున్నాడట.

 వరుణ్ ఎంట్రీ అదిరిపోవాలని భారీ యాక్షన్ సన్నివేశాలను నూరేస్తున్నాడు. తిండీ నిద్రా మానేసి కథ రాయడంలోనే మునిగిపోయాడట. ఇంతా చేసి అతడు సినిమాకు ఏ పేరు పెట్టాడనుకుంటున్నారు? 'మరో చిరుత' అట. ఈ పేరు వినగానే కొందరు సూపర్ అంటే, మరికొందరు అదేం పేరు అంటూ పెదవి విరుస్తున్నారు. విరవకేం చేస్తారు! చిరుత సినిమా హిట్టయినంత మాత్రాన మరో చిరుత అని పెట్టేస్తారా ఏంటి! మరి ఆ ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎవరైనా వస్తే ఏం పేరు పెడతాడు? 'ఇంకో చిరుత' అని పెడతాడా!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English