రాజమౌళి కదా… ఏం చేసినా చెల్లుతుంది!

రాజమౌళి ఇప్పుడు ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్. అందులో ఎలాంటి అనుమానం లేదు. బాహుబలిని కొట్టే సినిమా ఇంకా బాలీవుడ్ నుంచి కూడా రాలేదు. ఆర్.ఆర్.ఆర్. తో ఇప్పుడు మళ్ళీ తనకి తానె సవాల్ విసురుకుంటున్నాడు. ఎంత పెద్ద యాక్టర్ అయినా రాజమౌళితో సినిమా అంటే అన్నీ మానేసి రెడీగా ఉంటాడిపుడు. తారక్, చరణ్ లాంటి పెద్ద స్టార్స్ తో మరో దర్శకుడు అయితే సాహసం చేయగలిగే వాడు కాదు. రాజమౌళికి అంతటి రెస్పెక్ట్ ఇప్పుడు.

అయితే క్రాఫ్ట్ ని, క్రియేటివిటీని చిన్న చూపు చూడడం తగదు. సొంత సినిమాలను కాదనుకుని, చరిత్రలో ఎన్నడూ లేనట్టు ఒక విదేశీ చిత్రానికి ఉత్తమ చిత్రంగా ఆస్కార్ అవార్డు ఇచ్చారంటే ఆ సినిమా అన్ని సినిమాల్లాంటిది కాదనేది అర్థం కావాలి. టరంటినో, స్కోర్ససీ లాంటి దిగ్దర్శకులు విస్తు పోయారంటే ఆ సినిమాలోని ఒరిజినాలిటీ ఏమిటో తెలుసుకోవాలి. నచ్చకపోతే… ఆ సినిమా పట్ల తనకు అందరిలాంటి అభిప్రాయం లేదని, తన సెన్సిబిలిటీస్ కి భిన్నమైనదని అనేసి ఊరుకోవచ్చు. కానీ సినిమా చూస్తూ నిద్ర పోయానని, బోర్ కొట్టిందని, ఆస్కార్ అవార్డులకు కూడా లాబీయింగ్ ఉంటుందని రాజమౌళి స్థాయి దర్శకుడు మాట్లాడ్డం బాగోలేదు.

ఇప్పుడు ఇండస్ట్రీలో తాను ఏమి చేసిన చెల్లుతుంది కదా అని ఇలాంటి వ్యాఖ్యలు కూడా చెల్లిపోతాయి అనుకుని ఉండవచ్చు. లేదా బాహుబలి చిత్రాన్ని భారతేతర మార్కెట్లలో తిరస్కరించారు కనుక ఒక కొరియా చిత్రం గురించి మనం గొప్పగా మాట్లాడేదేంటి అనుకోవచ్చు. కాకపోతే తన స్థాయిలో ఉన్నప్పుడు విమర్శలు అయినా, అభిప్రాయం చెప్పడం అయినా ఆచి తూచి మాట్లాడకపోతే సినీప్రియులు హర్ట్ అవుతారు.