జగన్ సస్పెండ్ చేస్తే… కేంద్రం పెద్ద పోస్ట్ ఇచ్చింది

ఓవైపు ఏపీలో అధికార వైసీపీ, బీజేపీ రాష్ట్ర నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతున్న త‌రుణంలో కేంద్రంలో ప‌రిపాలిస్తున్న బీజేపీ ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి షాక్‌కు గుర‌య్యే నిర్ణ‌యం తీసుకుంది. జ‌గ‌న్ సార‌థ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధుల నుంచి తొలిగించి కేసు నమోదు చేసిన ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిశోర్‌కు కేంద్రంలో పదోన్నతి క‌ట్ట‌బెట్టింది. త‌ద్వారా జ‌గ‌న్ స‌ర్కారు తొల‌గించిన అధికారికి కీల‌క ప‌ద‌వి ఇచ్చింది.

జాస్తి కృష్ణ కిశోర్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్థికాభివృద్ధి బోర్డు సీఈఓగా పనిచేశారు. అయితే వైసీపీ ర‌థ‌సార‌థి జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన అనంత‌రం ప‌రిణామాలు మారాయియ. కృష్ణకిశోర్ అవినీతికి పాల్పడ్డార‌ని పేర్కొంటూ జగన్ సర్కార్ అధికారంలోకి రాగానే ఆయనను సస్పెండ్ చేస్తున్నట్టు నిర్ణయం తీసుకుంది.

కృష్ణకిషోర్‌పై కేసులు నమోదు చేసింది. అయితే దీనిపై కృష్ణ కిశోర్ సైతం ఈ విష‌యాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొని క్యాట్‌ను ఆశ్రయించారు. అనంత‌రం సస్పెన్షన్‌పై క్యాట్ స్టే విధించింది. దాంతో ఆయన రాష్ట్ర సర్వీసుల నుంచి కేంద్రానికి రిపోర్ట్ చేశారు.

కృష్ణ కిశోర్ ఆరోప‌ణ‌ల విష‌యంలో అడ్డంకులు తొల‌గిన నేప‌థ్యంలో కృష్ణ ఆయ‌న‌‌కు ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌గా పదోన్నతి కల్పిస్తూ ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ ప్రధాన కార్యాయలయంలో రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశించింది. దీంతో కీల‌క స‌మ‌యంలో ఇటు జ‌గ‌న్ సర్కారుకు షాక్ త‌గిలిన‌‌ట్ల‌యిందని అంటున్నారు.