పాపం దేవా కట్టా

పాపం దేవా కట్టా

    వెన్నెల సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన దేవా కట్టా ఈ తొమ్మిదేళ్లలో మూడంటే మూడే సినిమాలు తీసాడు. వెన్నెలకి, ప్రస్థానంకీ మధ్య అయిదేళ్ల విరామం వచ్చింది. ప్రస్థానంతో దర్శకుడిగా ఎంతో మంచి పేరు వచ్చినా కానీ ఆటోనగర్‌ సూర్య సినిమా కూడా రిలీజ్‌కి చాలా కష్టాలు పడింది. ఫలితంగా ప్రస్థానం తర్వాత కట్టాకి మళ్లీ నాలుగేళ్ల గ్యాప్‌ వచ్చింది. ఇన్నేళ్లు ఒకే సినిమాపై పడ్డ కష్టం ఫలిస్తే బానే ఉంటుంది కానీ... అది వృధా ప్రయాసగా మిగిలిపోతేనే సదరు దర్శకుడిపై జాలేస్తుంది. ప్రస్థానం సినిమా ఆర్థికంగా విజయం సాధించకపోయినా కానీ దేవా కట్టాకి దర్శకుడిగా చాలా పేరు తెచ్చిపెట్టింది. దాంతో అతని తదుపరి చిత్రంపై ఆసక్తి రేకెత్తింది. ఆటోనగర్‌ సూర్య మొదలైనప్పుడు అంచనాలు రేకెత్తించింది. అయితే విడుదల బాగా ఆలస్యం అయిపోవడంతో సినిమా స్టేల్‌ అయిపోయింది.

ఎట్టకేలకు విడుదల చేసినా కానీ అదేదో వదిలించేసుకోవాలన్నట్టుగా అస్సలు ప్రచారం లేకుండా ఆటోనగర్‌ సూర్యని వదిలారు. దాంతో ఓపెనింగ్స్‌ కూడా రాలేదు. సినిమా కూడా యావరేజ్‌గా ఉందేనే టాక్‌ రావడంతో ఇక ఇది నిలదొక్కుకోవడం కష్టమేనంటున్నారు. రిలీజ్‌ తర్వాత రీ ఎడిటింగ్‌ చేయడం వల్ల ఫలితం ఉంటుందని ఆశిస్తున్నారు కానీ ఒక్కసారి వీక్‌ టాక్‌ వచ్చిన సినిమా బతికి బట్ట కట్టడం కష్టమే. ఈ సినిమాని ఎలాగోలా నిలబెట్టుకోవడానికి తనకి తెలిసిన మార్గాలన్నీ వాడేస్తోన్న దేవా కట్టాని చూసి పాపం అనుకుంటూ జాలి పడడం మినహా ఇక ఈ సూర్యుడ్ని వెలిగించే అవకాశాల్లేవు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు