జ‌గ‌న్ సూప‌రన్న క‌ర్ణాట‌క మాజీ సీఎం

క‌రోనాపై పోరులో మొద‌ట బాగా విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. ఐతే అప్పుడు తెగిడిన నోళ్లే ఇప్పుడాయ‌న్ని పొగుడుతున్నాయి. త‌న త‌ప్పుల‌ను దిద్దుకున్న జ‌గ‌న్.. ఇప్పుడు క‌రోనాపై పోరులో స‌మ‌ర్థంగా ప‌ని చేస్తున్న రాష్ట్రాల్లో ఒక‌టిగా ఏపీని నిలిపారు. దీంతో ఆయ‌న ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థుల్లో ఒక‌రైన జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం ఆయ‌న్ని అభినందించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి వ‌చ్చింది.

ఒకేసారి వెయ్యికి పైగా అంబులెన్సులు ప్ర‌వేశ‌పెట్ట‌డం ద్వారా నేష‌న‌ల్ మీడియాలో సైతం జ‌గ‌న్ గురించి పాజిటివ్ న్యూస్‌లు వ‌చ్చాయి. తాజాగా కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, క‌ర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య‌.. ట్విట్ట‌ర్ వేదిక‌పై జ‌గ‌న్‌పై ప్ర‌శంస‌లు కురిపించ‌డం విశేషం.

త‌మ రాష్ట్రంలో ప‌రిస్థితుల‌ను.. ఏపీతో పోలుస్తూ జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని కొనియాడారు సిద్ధ‌రామ‌య్య‌. ‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రూ. 200 కోట్ల వ్యయంతో 1,000 కి పైగా అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. మా రాష్ట్రంలో అంబులెన్స్ లేక ప్రజలు వీధుల్లో చనిపోతున్నారు. ఇలాంటి చూసైనా నేర్చుకోండి.’’ అంటూ సిద్ధరామయ్య క‌న్న‌డ భాష‌లో ట్వీట్ చేశారు.

ఒక మాజీ సీఎం, అందులోనూ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత ఇలా జ‌గ‌న్ మీద ప్ర‌శంస‌లు కురిపించ‌డంతో వైకాపా కార్య‌క‌ర్త‌లు, జ‌గ‌న్ అభిమానులు ఈ ట్వీట్‌ను పెద్ద ఎత్తున షేర్ చేస్తూ.. ద‌టీజ్ జ‌గ‌న్ అంటూ కొనియాడుతున్నారు. డాక్ట‌ర్స్ డే సంద‌ర్భంగా జ‌గ‌న్ స‌ర్కారు ఇటీవ‌లే ఒకేసారి 1086 అంబులెన్సులు (108, 104) ప్రారంభించ‌డంతో పాటు గుంటూరులో ఉచిత క్యాన్స‌ర్ ఆసుప‌త్రిని కూడా అందుబాటులోకి తెచ్చింది.