కిం కర్తవ్యం :టిటిడిపి, టిబిజేపి

కిం కర్తవ్యం :టిటిడిపి, టిబిజేపి

తెలంగాణ తెలుగుదేశం, తెలంగాణ బిజేపి నేతల పరిస్థితి అరకత్తరలో పోకలా తయారైంది. టిడిపి అధినేత చంద్రబాబు వైఖరి, మోడీ వ్యవహరిస్తున్న తీరు తెలంగాణలో వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. టిడిపి ఎలాగు చావు తప్పించుకుని కన్ను లొట్టపోయినట్టుగా తయారైంది. ఇప్పుడు తెలంగాణ విషయంలో టిడిపి ఉన్నా, లేకున్నా పెద్దగా పట్టించుకునే పరిస్థితుల్లో లేడు చంద్రబాబు. తనకు కావాల్సిన సీమాంద్రలో అధికారం దక్కింది. ఇక బిజేపి పరిస్థితి అలా కాదు, దక్షిణాది రాష్ట్రాలలో కర్ణాటక తర్వాత మంచి పట్టున్న రాష్ట్రమే తెలంగాణ. తెలంగాణలో పాగా వేసేందుకు ప్రయత్నించి తెలంగాణ బిల్లు విషయంలో టిడిపితో చేతులు కలిపి తప్పటడుగులు వేసి నష్టాన్ని చవిచూసిందన్న భావన ఇప్పటికే తెలంగాణ బిజేపి నేతల్లో నెలకొంది. దీనికి తాజా పరిణామాలు జోడు కావడంతో భవిష్యత్తుపై తెలంగాణ బిజేపి నేతలకు దిగులు పట్టుకుంది.

 టిడిపి అధినేత తెలంగాణ విషయంలో వ్యతిరేక నిర్ణయాలనే ప్రకటిస్తున్నాడన్న భావం టిటిడిపి నేతల్లో వ్యక్తమవుతోంది. మహానాడు వేదికగా ఆయన ఉద్యోగులు, పోలవరం వంటి విషయాలలో చేసిన ప్రకటనలు చట్టం, రాజ్యాంగం పరంగా వాస్తవమే అయినప్పటికి తెలంగాణ విషయంలో అవి ఇక్కడి వారికి గిట్టని మాటలు. సెంటిమెంట్ ముందు ఏది పనిచేయదని ఈ ఫలితాలే రుజువుచేసాయి. ఇప్పటికే చంద్రబాబు పక్కా సమైక్యం అన్న భావం తెలంగాణలో నెలకొంది. ఇప్పుడు పంపకాల విషయంలో చంద్రబాబు పూర్తిగా సీమాంద్ర పక్షాన నిలిచి పోరాడేలా ఉన్నాడు. పోలవరం,ఉద్యోగుల విషయంలో అది క్లియర్ అయింది. ఈ వైఖరి ఇలాగే కొనసాగితే తెలంగాణలో తాము తిరగడమే కష్టం అన్న భావం తెలుగుదేశం నేతల్లో నెలకొంటోంది.

 ఈ ప్రభావం మహానాడు తొలిరోజు స్పష్టంగా కనిపించింది. తొలిరోజు మహానాడుకు టిటిడిపి నేతలు రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావులు హాజరుకాలేదు. సరే వేరే కారణాలు ఉండొచ్చేమో కాని తాజా పరిణామాలు మాత్రం తెలంగాణలో తమకు కీడు తెచ్చిపెడతాయనే భావం మాత్రం వారిలో ఉంది. ఇదే ముదరితే టిడిపిని ఖాలీచేయడం తప్ప మరో మార్గం లేదన్న అభిప్రాయాన్ని కొందరు సీనియర్ నేతలే సన్నిహితుల వద్ద వాఖ్యానిస్తున్నట్లు సమాచారం. ఇక తెలంగాణ బిజేపి నేతల్లో కూడా గుబులుతో పాటు అదిష్టానంపై ఆగ్రహంతో ఉన్నారు.

 మెడీ  గెలిచినప్పటినుంచి తెలంగాణ విషయంలో వివక్ష చూపుతున్నారన్న భావం వారిలో ఇప్పటికే నెలకొంది. మంత్రి వర్గంలో ఒక్క పదవి కూడా కట్టబెట్టకపోవడం ఈ ఆగ్రహానికి కారణమైంది. పైగా మోడీ భేటి అయిన తొలిక్యాబినెట్ లోనే వివాదాస్పదమైన పోలవరం ప్రాజెక్టు అంశాన్ని ముట్టుకోవడం, తెలంగాణవారు వ్యతిరేకిస్తున్న దానికే ఆయన ఓటు వేసి ఆర్డినెన్స్ ను జారీ చేయించడంతో తెలంగాణ బిజేపి నేతల్లో ఆందోళన మరింత తీవ్రమైంది. ఈ విషయంలో ఇప్పుడు టిఆర్ఎస్,అన్ని జేఏసి, వివిధ రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు కలిసి ఉమ్మడి పోరాటానికి సిద్దమయ్యాయి. తెలంగాణ ఉద్యమంలో జేఏసిలో కీలక పాత్ర పోషించిన బిజేపి ఇప్పుడేం చేయాలి.

 తమ ప్రభుత్వం చేసిన పనికే విరుద్దంగా ఉద్యమించాలా, ఊరుకోవాలా, నిశ్శబ్దంగా ఉంటే తెలంగాణలో మరింత పతనం తప్పదు. ఇది తెలిసి మోడీ ఇలా ఎందుకు చేసారు. ఇప్పడు కూడా అంటే తెలంగాణ బిల్లు విషయంలో చివరలో టిడిపితో కలిసి మెలికలు పెట్టిన మాదిరిగానే చంద్రబాబు డైరెక్షన్ లోనే ఈ ఆర్డినెన్స్ తెచ్చారన్న ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే మోడీ అధికారికంగా కొలువుదీరిందే ఇప్పుడు. అంటే పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. అవి జరిగే అవకాశం లేనప్పుడే కదా... ఆర్డినెన్స్ లు తేవాలి. అంటే పక్కా తెలంగాణకు వ్యతిరేకంగా మోడీ వెలుతున్నట్లే అంటున్నారు. ఈ సంకేతాలన్నీ తెలంగాణలో బిజేపి, టిడిపి నేతలకు ఆందోళన కలిగిస్తున్నాయి. రాజకీయ పరిణామాలు మున్ముందు ఎలా ఉంటాయో అన్న సంకేతాలను జారీ చేస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు