బాలు నోట బాలీవుడ్ పాట!

బాలు నోట బాలీవుడ్ పాట!

ఎస్ పీ బాలసుబ్రమణ్యం. తెలుగు పాటతోనే కాక పరాయి భాషల పాటలు పాడి కూడా జాతీయస్థాయి అవార్డులు అందుకున్న గాయకుడు. తన మాతృభాషలో కాకుండా పరాయి భాషల్లో పాటలు పాడి దాని ద్వారా జాతీయ అవార్డు అందుకున్న అతి తక్కువమంది గాయకుల్లో బాలు కూడా ఒకరు. హిందీ సినిమా 'ఏక్ దుజే కెళీయే' తోనూ కొన్ని తమిళ సినిమాలకూ  బాలు జాతీయ అవార్డును అందుకున్నారు. బాలు స్వరరాగ నేపథ్యం గురించి చెప్పాలంటే ఇలాంటివి చాలా చెప్పాల్సి ఉంటుంది. తాజా అప్ డేట్ ఏంటంటే..బాలసుబ్రమమణ్యం తాజాగా ఒక హిందీ పాట పాడారు. అది కూడా బాలీవుడ్ బాద్ షా "చెన్నై ఎక్స్ ప్రెస్' కోసం ఈ సినిమా టైటిల్ సాంగ్ ను బాలసుబ్రమణ్యం ఆలపించారు. ఇందుకు ప్రధాన కారణం ఈ సినిమా సంగీత దర్శకులు విశాల్ శేఖర్ లని తెలుస్తోంది.

గతంలో వెంకటేశ్ సినిమా 'చింతకాయల రవి' కి సంగీతం సమకూర్చిన ఈ జోడి బాలుకు హార్డ్ కోర్ ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో వారు ఈ లెజెండరీ సింగర్ తో తమ పాట పాడించుకుంటున్నారు. ఇక షారూఖ్ సినిమాకు బాలూ సాంగ్ కూడా ప్రత్యేక ఆకర్షణ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా విషయంలో పేరుకు దక్షిణాది నగరాన్ని ఉపయోగించుకోవడమే కాక దక్షిణాదికి చెందిన టెక్నీషియన్స్ ను, గాయకులను, నటీనటులను ఉపయోగించుకుంటుండటంతో ఇది ముంబై నుంచి వస్తున్న "చెన్నై ఎక్స్ ప్రెస్''నే తలపింపజేస్తోంది!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు