బౌండ‌రీల అవ‌త‌ల ప్ర‌భాస్ వీకైపోయాడా?

ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ ప్ర‌భాస్ కొత్త సినిమా రాధేశ్యామ్ విడుద‌ల కోసం అభిమానుల నిరీక్ష‌ణ ఎట్ట‌కేల‌కు ఫ‌లించింది. ఆ చిత్రం థియేట‌ర్ల‌లోకి దిగేసింది. గురువారం అర్ధ‌రాత్రి నుంచే యుఎస్‌లో ప్రిమియ‌ర్స్ మొద‌లైపోయాయి. ఇండియాలో హైద‌రాబాద్ స‌హా కొన్ని చోట్ల తెల్ల‌వారుజామున షోలు ప్లాన్ చేశారు. ఐతే సినిమాకు జెన్యూన్ టాక్ ఏంట‌న్న‌ది మార్నింగ్ షోలు అయ్యాక కానీ తెలియ‌దు.

ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో హైప్ అనుకున్న దాని కంటే ఎక్కువే ఉంది. సాహో డిజాస్ట‌ర్ అయిన‌ప్ప‌టికీ ఆ ప్ర‌భావం ప్ర‌భాస్ త‌ర్వాతి సినిమా మీద పెద్ద‌గా ప‌డ్డ‌ట్లు క‌నిపించ‌డం లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజిలో జ‌రిగాయి. తెలంగాణ‌లో ఐదారు రోజుల ముందే బుకింగ్స్ మొద‌లు కాగా.. పెట్టిన టికెట్లు పెట్టిన‌ట్లే అయిపోయాయి. ఏపీలో టికెట్ల ధ‌ర‌ల విష‌యంలో అస్ప‌ష్ట‌త వ‌ల్ల బుకింగ్స్ ఆల‌స్య‌మ‌య్యాయి.

కానీ అక్క‌డా తొలి వీకెండ్లో సినిమా హౌస్ ఫుల్స్‌తో న‌డ‌వ‌బోతోంద‌ని బుకింగ్స్‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది.
ఐతే తెలుగు రాష్ట్రాల అవ‌త‌ల మాత్రం ప్ర‌భాస్ వీక్ అయిపోయాడా అన్న సందేహాలు క‌లుగుతున్నాయి. సాహో చిత్రానికి ఉన్న హైప్, క్రేజ్ రాధేశ్యామ్‌కు క‌నిపించ‌డం లేద‌న్న‌ది స్ప‌ష్టం. అది బాహుబ‌లి త‌ర్వాత వ‌చ్చిన సినిమా, పైగా పక్కా యాక్ష‌న్ మూవీ, హీరో ఎలివేష‌న్ల‌కు లోటు లేని చిత్రం కావడంతో హైప్ మామూలుగా రాలేదు. కానీ సాహో అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లు లేక‌పోవ‌డంతో ఆ ప్ర‌భావం రాధేశ్యామ్ మీద ప‌డ్డ‌ట్లు క‌నిపిస్తోంది.

దీనికి తోడు ఇది ల‌వ్ స్టోరీ కావ‌డం, యాక్ష‌న్, ఎలివేష‌న్లు లేక‌పోవ‌డం, ట్రైల‌ర్లు యావ‌రేజ్‌గా అనిపించ‌డం ప్ర‌తికూల‌మైన‌ట్లున్నాయి. బెంగ‌ళూరు, చెన్నై, ముంబ‌యి, ఢిల్లీ లాంటి న‌గ‌రాల్లో బుకింగ్స్ చాలా వీక్‌గా ఉన్నాయి. ఓవ‌రాల్ ఆక్యుపెన్సీ ఎక్క‌డా 50 శాతం కూడా లేద‌ని బుకింగ్స్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. మ‌రోవైపు యుఎస్‌లో సైతం రాధేశ్యామ్ ప్రి సేల్స్ అనుకున్న స్థాయిలో లేవు. భీమ్లా నాయ‌క్ ప్రిమియ‌ర్స్‌తో 8.6 ల‌క్ష‌ల డాల‌ర్లు క‌లెక్ట్ చేయ‌గా.. రాధేశ్యామ్ అంత‌కంటే త‌క్కువే రాబ‌ట్టేలా ఉంది ప్రిమియ‌ర్స్‌తో.