చరణ్ సినిమా.. శంకర్ విజనరీయే

‘ఆర్ఆర్ఆర్’ పెరగబోయే తన ఇమేజ్, మార్కెట్, ఫాలోయింగ్‌కు తగ్గట్లే ఒక మెగా సినిమాను లైన్లో పెట్టాడు రామ్ చరణ్. తెలుగు స్టార్ హీరోలందరూ ఒక్కసారి పని చేయాలని ఆశ పడుతున్న తమిళ లెజెండరీ డైరెక్టర్ శంకర్‌తో అతను సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అనివార్య కారణాలతో బ్రేక్ పడ్డ ‘ఇండియన్-2’ను పూర్తిగా పక్కన పెట్టేసి శంకర్ ఈ సినిమా చేస్తున్నాడు.

ఐ, రోబో-2 చిత్రాలతో నిరాశ పరిచిన శంకర్‌కు ఈ సినిమాతో హిట్టు కొట్టడం చాలా అవసరం. దిల్ రాజు నిర్మాణంలో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ ప్రభుత్వ అధికారి పాత్రలో కనిపించనున్నాడని.. ఈ సినిమాకు ‘సర్కారోడు’ అనే టైటిల్ అనుకుంటున్నారని వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. 2023 సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకులను పలకరించనుంది. కాగా ఈ సినిమా గురించి ఇప్పుడు మరో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

శంకర్-చరణ్ సినిమా తొలి షెడ్యూల్ వరకు హైదరాబాద్‌లో చేసి.. ఆ తర్వాత యూనిట్ అంతా రాజమండ్రికి వెళ్లింది. అక్కడ, చుట్టు పక్కల ప్రాంతాల్లోనే చాలా రోజుల పాటు షూటింగ్ చేశారు. రెండు షెడ్యూళ్లు అక్కడే నడిచాయి. ఇంకా కొన్ని సన్నివేశాలను ఆ ప్రాంతంలోనే చిత్రీకరించనున్నారట. ఇది ఈ సినిమాకు చాలా మేలు చేసే విషయంగా మారడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తెచ్చిన జీవో ప్రకారం హీరో హీరోయిన్లు, డైరెక్టర్ పారితోషకం కాకుండా వంద కోట్ల బడ్జెట్, అలాగే ఆంధ్రాలో 20 శాతం చిత్రీకరణ జరుపుకున్న చిత్రాలకు తొలి పది రోజులు టికెట్ల ధరలు పెంచుకునే సౌలభ్యం కల్పించింది ప్రభుత్వం.

ప్రస్తుతం పూర్తయిన, ప్రొడక్షన్ దశలో ఉన్న చిత్రాల్లో ఈ విభాగంలోకి రాగల సినిమా చరణ్-శంకర్‌లదే. ఇప్పటికి చిత్రీకరించిన సన్నివేశాలు సినిమాలో 20 శాతానికి తక్కువేమీ ఉండవట. ఈ సినిమా బడ్జెట్ రూ.200 కోట్లంటున్నారు. పారితోషకాలు తీసేస్తే వంద కోట్లకు పైగానే బడ్జెట్ తేలుతుంది. కాబట్టి ఏపీలో రేట్లు పెంచుకోవడానికి ఈ సినిమాకు ఇబ్బంది లేదు. ఇదంతా పరిశీలించి భవిష్యత్తును ముందే ఊహించి సినిమాలు తీస్తాడనే పేరున్న శంకర్‌.. తాను విజనరీ అని మరోసారి రుజువు చేశాడంటూ నెటిజన్లు పొగడ్తలు గుప్పిస్తుండటం విశేషం.