హ్యాట్రిక్ కోసం కేసీఆర్ పాట్లు!

గ‌త రెండు ఎన్నిక‌ల్లో లేనిది ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లో బ‌ల‌మైన పోటీ ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ముచ్చ‌ట‌గా మూడోసారి పార్టీని అధికారంలోకి తీసుకు వ‌చ్చి హ్యాట్రిక్ విజ‌యాన్ని న‌మోదు చేయ‌డం కోసం ఆయ‌న తీవ్రంగా శ్రమిస్తున్నార‌ని అంటున్నారు. అందుకే మ‌రోసారి ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లి గెల‌వాల‌ని చూస్తున్నార‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోప‌ణ‌లు చేస్తున్నాయి. కేసీఆర్ అడుగులు కూడా ఆ దిశ‌గానే సాగుతున్నాయ‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

ఆ ప్ర‌క‌ట‌న‌ల‌తో..
2018లో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లిన కేసీఆర్ రాష్ట్రంలో రెండో సారి పార్టీని అధికారంలోకి తీసుకు వ‌చ్చారు. కానీ ఆ త‌ర్వాత రాజ‌కీయ ప‌రిణామాలు మారిపోయాయి. ముఖ్యంగా ఇటీవ‌ల కాంగ్రెస్‌, బీజేపీ నుంచి ఆ పార్టీకి స‌వాలు ఎదుర‌వుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త్రిముఖ పోరు త‌ప్పేలా లేదు.

అందుకే మ‌రోసారి కేసీఆర్ ముందస్తుకు వెళ్లి ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు చెక్ పెడ‌తార‌ని చెబుతున్నారు. అందుకే వ‌రుస‌గా కీల‌క ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డంతో పాటు జాతీయ రాజ‌కీయాలు అంటూ హ‌డావుడి చేస్తున్నార‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇటీవ‌ల అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌లోనూ ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో సంక్షేమ ప‌థ‌కాల‌కు పెద్ద పీఠ వేశార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ముంద‌స్తు సూచ‌న‌లే..
రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన ద‌ళితులంద‌రికీ ద‌శ‌ల వారీగా ద‌ళిత బంధు ప‌థ‌కం అమ‌లు చేస్తామ‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు. అందుకోసం బ‌డ్జెట్లో ఏకంగా రూ.17,700 కోట్లు కేటాయించారు. ద‌ళితుల ఓట్ల‌ను సొంతం చేసుకునేందుకే కేసీఆర్ ఈ ప‌థ‌కానికి తెర‌తీశార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇక ఇటీవ‌ల వ‌రుస‌గా జిల్లాల ప‌ర్య‌ట‌న‌లు చేస్తూ కేంద్రంపై విమర్శ‌లు గుప్పిస్తూ శ్రేణుల‌ను స‌మ‌రానికి సిద్ధం చేస్తున్నారు. మ‌రోవైపు కేంద్రంలోని బీజేపీపై పోరులోక‌లిసి వ‌చ్చే పార్టీల‌తో స‌మావేశం అయేందుకు దేశ‌వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తున్నారు. ఇక ఇప్పుడు ఉద్యోగాల భర్తీ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసి నిరుద్యోగుల అసంతృప్తిని త‌గ్గించే ప్ర‌య‌త్నం చేశార‌ని అంటున్నారు. ఈ చ‌ర్య‌ల‌న్నీ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు మ‌రోసారి కేసీఆర్ వెళ్తార‌నే సూచ‌న‌లే అంటూ నిపుణులు అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు.