వార్నీ కాజ‌లూ.. ఏంది నీ జోరు

వార్నీ కాజ‌లూ.. ఏంది నీ జోరు

అల్ల‌రి న‌రేష్ స‌ర‌స‌న కాజ‌ల్.. కొన్ని రోజుల కింద‌ట బ‌య‌టికొచ్చిన వార్త ఇది. ఇది నిజ‌మో, ఉత్తుత్తి ప్ర‌చార‌మో కానీ.. ఆ వార్త చూసి కాజ‌ల్ రేంజ్ ఎంత‌గా ప‌డిపోయిందో అని అభిమానులు చాలా ఫీలైపోయారు. హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మై పుష్క‌ర కాలం దాటినా ఇంకా గ్లామ‌ర్ కాపాడుకుంటూ కుర్రాళ్ల గుండెల్లో మంట‌లు రేపుతున్న కాజ‌ల్‌ను న‌రేష్ లాంటి చిన్న హీరోతో చిన్న సినిమాలో చూడాల్సి వ‌స్తుందంటే అభిమానులకు ఎలాంటి ఫీలింగ్ క‌లుగుతుందో చెప్పేదేముంది?

ఐతే అల్ల‌రోడి సినిమా సంగ‌తేంటో తెలియ‌ట్లేదు కానీ.. ఈ లోపు కాజల్‌కు వ‌రుస‌గా భారీ సినిమాల్లో అవ‌కాశాలు వ‌స్తుండ‌టం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఆల్రెడీ క‌మ‌ల్ హాస‌న్‌-శంక‌ర్‌ల ఇండియ‌న్‌-2లో ఆమె హీరోయిన్ అన‌న సంగ‌తి తెలిసిందే. ఆ సినిమాకు అనివార్య కార‌ణాల‌తో బ్రేక్ ప‌డింది. క‌రోనా ఎఫెక్ట్ కూడా తోడై ఇప్పుడిప్పుడే ఆ సినిమా పునఃప్రారంభ‌మ‌య్యేలా క‌నిపించ‌ట్లేదు.

కానీ ఈ లోపు కాజ‌ల్‌కు మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ఆచార్య‌లో న‌టించే ఛాన్సొచ్చింది అనుకోకుండా. త్రిష తప్పుకోవ‌డంతో కాజ‌ల్‌ను అవ‌కాశం వ‌రించింది. దీనికే ఆమె పొంగిపోతుంటే.. త‌మిళంలో విజ‌య్‌-మురుగ‌దాస్‌ల కాంబినేష‌న్లో తెర‌కెక్క‌బోయే కొత్త సినిమాకు ఆమెనే క‌థానాయిక‌గా అడుగుతున్నార‌న్న వార్త బ‌య‌టికి వ‌చ్చింది.

ఇంత‌కుముందు వీళ్లిద్ద‌రూ క‌లిసి చేసిన తుపాకికి ఇది సీక్వెల్ అంటున్నారు. తుపాకిలో కాజ‌లే హీరోయిన్. సీక్వెల్లోనూ ఆమె పాత్ర‌ను కొన‌సాగించాల‌ని అనుకుంటున్నార‌ట‌. నిజంగా ఈ సినిమాలోనూ కాజ‌ల్‌కు అవ‌కాశం వ‌స్తే మాత్రం ఆమె కెరీర్ ఇంకో రెండు మూడేళ్లు పొడిగించిన‌ట్లే.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English