సుధీర్ బాబు ఎంత మంచి ఛాన్స్ వదిలేశాడు

సుధీర్ బాబు ఎంత మంచి ఛాన్స్ వదిలేశాడు

యువ కథానాయకుడు సుధీర్ బాబు హీరోగా అరంగేట్రం చేశాక చాలా కాలం పాటు మహేష్ బాబు బావగా.. కృష్ణ అల్లుడిగానే గుర్తింపు పొందాడు. కానీ గత కొన్నేళ్లలో అతడికంటూ సొంత గుర్తింపు వచ్చింది. కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, సమ్మోహనం, నన్ను దోచుకుందువటే సినిమాల్లో మంచి పాత్రలు చేశాడు. చక్కటి నటన కనబరిచాడు.

 తన సామర్థ్యాన్ని శంకించిన వాళ్లందరికీ సమాధానం చెప్పాడు. ఇప్పుడు ‘వి’ లాంటి స్పెషల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సుధీర్.. గతంలో బాలీవుడ్లోనూ ‘బాగి’ ఓ పెద్ద సినిమాలో నటించాడు. ఆ సినిమా హిందీలో పెద్ద హిట్టయింది. సుధీర్‌కూ మంచి పేరు తెచ్చింది. ఐతే అంత పెద్ద హిట్ సినిమాలో చేశాక మళ్లీ హిందీలో సుధీర్ ఇంకో సినిమా చేయకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

మరి అవకాశాలు రాలేదా.. సుధీరే ఒప్పుకోలేదా అన్నది తెలియదు. ఇదే విషయం సుధీర్ వద్ద ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తే హిందీ నుంచి అవకాశాలు వచ్చాయని, కానీ తానే ఒప్పుకోలేదని చెప్పాడు. ముఖ్యంగా అతను ‘బ్రహ్మాస్త్ర’ లాంటి భారీ చిత్రంలో అవకాశాన్ని వదులుకున్నాడు. రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో అగ్ర నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్న భారీ చిత్రమిది. ఇందులో నాగార్జున కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. ఇందులో ఓ పాత్రకు సుధీర్‌ను కూడా అడిగారట.

ఐతే పుల్లెల గోపీచంద్ బయోపిక్ కోసమని దీన్ని వదులుకున్నట్లు అతను చెప్పాడు. గోపీ బయోపిక్ కోసం సన్నబడాల్సి వచ్చిందని.. బ్రహ్మాస్త్ర కోసం లుక్ మార్చుకోవాలని.. పైగా 90 రోజులు డేట్లు అడిగారని.. దీంతో బయోపిక్‌కు ఇబ్బంది అవుతుందని దాన్ని వదులకున్నానని సుధీర్ చెప్పాడు. 90 రోజుల డేట్లు అడిగారంటే ‘బ్రహ్మాస్త్ర’లో సుధీర్‌కు ఆఫర్ చేసింది పెద్ద పాత్రే కావచ్చు. ఐతే మూడేళ్లుగా చర్చల్లో ఉన్న గోపీ బయోపిక్ ఎంతకీ మొదలు కావడం లేదు. ఇలాంటి సినిమా కోసం ‘బ్రహ్మాస్త్ర’ను వదులుకున్నందుకు సుధీర్ కచ్చితంగా ఫీలవుతుంటాడేమో.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English