టాలీవుడ్ స్టార్స్.. కొత్త రికార్డులు మీకోసమే చూస్తున్నాయ్

టాలీవుడ్ స్టార్స్.. కొత్త రికార్డులు మీకోసమే చూస్తున్నాయ్

టాలీవుడ్ స్టార్ హీరోలకు ఉన్న రికార్డుల మోజు ఎలాంటిదో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కొందరు ఓపెన్‌గా ఈ రికార్డుల పిచ్చిని బయటపెట్టుకుంటుంటారు. కొందరేమో పైకి చెప్పకుండా లోలోనే మురిసిపోతుంటారు.

మొన్న సంక్రాంతికి మహేష్ బాబు, అల్లు అర్జున్‌ల సినిమాలు రిలీజైతే రికార్డుల గురించి ఎంతగా ప్రచారాలు జరిగాయో.. ఒకరితో ఒకరు పోటీ పడి కలెక్షన్ల గొప్పలు పోయారో.. పోస్టర్లతో ఎలా హోరెత్తించేశారో అందరూ చూశాం.

ఐతే తమ సినిమాలకు వచ్చే వసూళ్లకు సంబంధించిన రికార్డుల్లో ఇలా పోటీ పడే స్టార్ల కోసం ఇప్పుడు కొత్త రికార్డులు ఎదురు చూస్తున్నాయి. అందులోనూ ఇలాగే పోటీ పడి నేను నంబర్ వన్ అంటే నేను నంబర్ వన్ అని పోటీ పడాల్సిన అవసరం వచ్చింది.

ఇంతకీ ఈ కొత్త రికార్డులు ఎందులో అంటారా? తమ దాతృత్వాన్ని చాటుకోవడంలో. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. అన్ని రంగాలూ లాకౌట్ అయిపోవడంతో ఆయా రంగాలకు చెందిన వాళ్లకు ఉపాధి లేకుండా పోయింది. ఆదాయం ఆగిపోయి అందరూ సంక్షోభంలో పడుతున్నారు.

 ప్రభుత్వం వారిని ఆదుకునేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తోంది. ఈ సమయంలో ప్రభుత్వానికి విరాళాలు అందజేసి తోడ్పాటు అందించవచ్చు. లేదా బయట కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవచ్చు. తమ పరిశ్రమలోని వాళ్లకు చేయూత ఇచ్చినా చాలు. ఈ విషయంలో ప్రకాష్ రాజ్, నితిన్ లాంటి వాళ్లు ఇప్పటికే ముందడుగు వేశారు.

తమ వంతు సాయాన్ని ప్రకటించారు. ఇప్పుడు వందలు, వేల కోట్ల ఆస్తిపరులైన బడా సినీ ఫ్యామిలీలు.. పదుల కోట్లలో పారితోషకాలు తీసుకునే హీరోలు ముందుకొచ్చి ఒకరిని మించి ఒకరు దాతృత్వాన్ని చాటుకుని.. రికార్డులు బద్దలు కొట్టాల్సిన సమయం ఆసన్నమైంది. మరి ఈ రికార్డుల వేటకు ఎంతమంది సిద్ధమవుతారో చూడాలి.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English