ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్‌లకు ఆఫర్ ఉందట

మొత్తానికి ఎదురు చూపులు ఫలించాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని థియేటర్లలో టికెట్ల ధరలను సవరించింది. మరీ కనీస స్థాయిలో ఉన్న ధరలను పెంచింది. సినీ పరిశ్రమ తెలంగాణతో సమానంగా రేట్లు ఇంకా ఎక్కువే ఉండాలని ఆశించినా.. ఈ మాత్రమైనా చేశారు చాలు అని చాలామంది సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాబోయే కొత్త చిత్రాలకు ఇది కచ్చితంగా ఊరటనిచ్చే విషయమే.

ఎందుకంటే గత వారం వచ్చిన ‘భీమ్లా నాయక్’ సినిమా మంచి టాక్ తెచ్చుకున్నా, తొలి వీకెండ్లో హౌస్ ఫుల్స్‌తో నడిచినా, రెండో వీకెండ్లోనూ జనాలను బాగానే థియేటర్లకు రప్పించినా.. చివరికి ఏపీలో లాస్ వెంచర్‌గానే నిలుస్తోందంటే అందుక్కారణం మరీ తక్కువగా ఉన్న టికెట్ల ధరలే. కాబట్టి ఇకపై రిలీజ్ కానున్న సినిమాలన్నింటికీ తాజా నిర్ణయం కలిసొచ్చేదే. ఐతే ఈ నెలలో రాబోయే భారీ చిత్రాలు రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్‌ల బడ్జెట్, వాటి అమ్మకాలు, బయ్యర్ల పెట్టుబడుల ప్రకారం చూస్తే ప్రభుత్వం పెంచిన రేట్లు కూడా సరిపోవనే చెప్పాలి.

ఈ స్థాయి చిత్రాలకు కాస్త ఎక్కువ రేట్ పెట్టడానికి ప్రేక్షకులు కూడా వెనుకాడరు. కాగా జీవోలో భారీ చిత్రాలకు తొలి పది రోజులు రేట్లు పెంచుకునే సౌలభ్యం కల్పించనున్నట్లు ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. కానీ ఇక్కడో మెలిక పెట్టింది. హీరో హీరోయిన్లు, డైరెక్టర్ పారితోషకం కాకుండా రూ.100 కోట్లు, అంతకంటే ఎక్కువ బడ్జెట్ ఉండి.. ఆంధ్రప్రదేశ్‌లో 20 శాతం చిత్రీకరణ జరుపుకున్న సినిమాలకే ఈ అవకాశం అని పేర్కొన్నారు.

ఈ రెండు చిత్రాలకూ మేకింగ్ వరకే రూ.100 కోట్ల కంటే ఎక్కువ ఖర్చే అయింది. కానీ ఇవి ఏపీలో చిత్రీకరణ జరుపుకోలేదు. ఈ కారణంగా వీటికి రేట్ల పెంపు అవకాశం ఉండదనే  భావించారు. కానీ ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని ఈ రెండు చిత్రాలకు మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొనడం విశేషం. ఇవి ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో.. ఏపీలో 20 శాతం చిత్రీకరణ షరతు ఇప్పుడే పెట్టాం కాబట్టి వీటికి రేట్లు పెంచుకునే అవకాశం కల్పిస్తామని ఆయన వెల్లడించారు. మంత్రే ఈ మాట అనడం ఈ రెండు చిత్రాలకు గొప్ప ఊరట అనడంలో సందేహం లేదు.