రష్యాకు ఉక్రెయిన్ తాజా షాక్

చిట్టెలుకే కదా చాలా ఈజీగా దెబ్బ కొట్టేయచ్చని అనుకుని యుధ్ధం మొదలుపెట్టిన రష్యాకు ఉక్రెయిన్ చుక్కలు చూపిస్తోంది. దేశంలోని అనేక నగరాలు ధ్వంసం అయిపోతుండచ్చు. అలాగే కీలకమైన ప్రాంతాలు రష్యా సైన్యం ఆధీనంలో ఉండచ్చు. అయితే దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ మాత్రం లొంగలేదు. అలాగే ఉక్రెయిన్ సైన్యంతో పాటు మామూలు జనాలు కూడా ఎక్కడికక్కడ రష్యా సైన్యానికి చుక్కలు చూపిస్తున్నారు.

యుద్ధానికి ముందు ఉక్రెయిన్ను రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ చాలా తేలికగా తీసుకున్నారు. పుతిన్ ఆలోచనల ప్రకారం యుద్ధం 48 గంటల్లో ముగిసిపోవాలి. అలాంటిది ఆరు రోజులైనా యుద్ధం ఒకకొలిక్కి రాలేదు. ఎక్కువరోజులు యుద్ధం జరిగితే రష్యాకే నష్టమెక్కువ. ఈ విషయం ఇలాగుంటే తాజాగా ఉక్రెయిన్ పార్లమెంటు తీసుకున్న ఓ నిర్ణయం రష్యాకు షాకిచ్చేదే అనటంలో సందేహంలేదు.

ఇంతకీ అదేమిటంటే ఉక్రెయిన్లో ఉన్న రష్యా ఆస్తులతో పాటు రష్యన్ పౌరులకు చెందిన ఆస్తులను ఉక్రెయిన్ ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. దీనివల్ల రష్యాకు భారీ ఆర్ధికనష్టం తప్పదనే అనుకోవాలి. ఎందుకంటే మొన్నటివరకు దేశాలు వేరైనా అంతా ఒకటే కదాన్న ఉద్దేశ్యంతో ఎంతోమంది రష్యన్ కుబేరులు ఉక్రెయిన్లో వందల కోట్ల డాలర్ల పెట్టబడులు పెట్టారు. 1990కి ముందు ఉక్రెయిన్ అనేది సోవియట్ యూనియన్లోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటి.

అలాంటిది 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛినమైపోవటంతో 15 రాష్ట్రాలు స్వతంత్ర దేశాలుగా ఏర్పడ్డాయి. వాటిలో అతిపెద్దదైన  ఉక్రెయిన్ కూడా ఒకటి. అందుకనే సోవియట్- రష్యాలో కుబేరులు ఉక్రెయిన్లో భారీగా పెట్టుబడులు పెడుతునే ఉన్నారు. ఇపుడీ యుద్ధం కారణంగా ఆ పెట్టుబడులు, ఆస్తులను ఉక్రెయిన్ స్వాధీనం చేసుకోబోతోంది. ఈ విషయమై రష్యాలోని కుబేరులంతా ఇపుడు పుతిన్ మీద పడతారు. మరి పుతిన్ ఏమి చేస్తారో చూడాలి.