లేటెస్ట్ బజ్.. పూరితో పవన్

లేటెస్ట్ బజ్.. పూరితో పవన్

రీఎంట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీడు మామూలుగా లేదు. 2024 ఎన్నికలకు ముందు రెండేళ్ల నుంచి పూర్తిగా రాజకీయాలకే పరిమితం కావాలని పవన్ నిర్ణయించుకున్న నేపథ్యంలో ఆలోపు తనకున్న రెండేళ్ల సమయంలో సాధ్యమైనన్ని ఎక్కువ సినిమాల్లో నటించి ఆర్థికంగా పరిపుష్టుడు కావాలని పవన్ గట్టిగా నిర్ణయించుకున్నట్లుంది. ఏడాదిలో మూడు సినిమాలు పూర్తి చేసేందుకు ప్రణాళికలు రచించుకున్న పవన్.. తర్వాతి ఏడాదిన్నరలో నాలుగైదు సినిమాలు అవగొట్టేయాలనుకుంటున్నాడు.

డబ్బుల విషయంలో ఒక ఫిగర్‌‌ను టార్గెట్‌గా పెట్టుకుని ఆయన సినిమాలు సెట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చేస్తున్న 'పింక్' రీమేక్.. విరూపాక్ష (క్రిష్ దర్శకత్వం)ల తర్వాత.. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

ఇవి కాక త్రివిక్రమ్‌తో కూడా ఓ సినిమా కోసం పవన్ సన్నాహాలు చేసుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది. ఇంతలో మరో స్టార్ దర్శకుడితో పవన్ సినిమా గురించి ప్రచారం మొదలైంది. పవన్‌కు 'బద్రి' లాంటి మరపురాని సినిమాను అందిస్తూ దర్శకుడిగా పరిచయం అయిన పూరి జగన్నాథ్ మరోసారి అతడితో సినిమా చేయనున్నట్లు చెప్పుకుంటున్నారు. మధ్యలో వీరి కలయికలో 'కెమెరామన్ గంగతో రాంబాబు' అనే మరో సినిమా వచ్చింది కానీ.. అది నిరాశ పరిచింది.

ఇకపై పవన్‌తో సినిమా చేయనంటూ పూరి స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా అప్పట్లో ప్రచారం జరిగింది కానీ.. అది నిజం కాదని పూరీనే క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం తన కెరీర్ ఉన్న పరిస్థితుల్లో మళ్లీ పవన్‌తో పని చేసే అవకాశం వస్తే పూరి వదులుకోడు. ఇంకా కసితో పని చేస్తాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో 'ఫైటర్' సినిమాను రూపొందిస్తున్న పూరి.. ఆ సినిమాతో హిట్టు కొడితే పవన్‌తో సినిమా చేయడానికి కచ్చితంగా దారులు తెరుచుకున్నట్లే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English