రజనీ సినిమా.. పట్టించుకోరేందయ్యా

రజనీ సినిమా.. పట్టించుకోరేందయ్యా

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటే కొన్నేళ్ల కిందటి వరకు ఎంత హంగామా ఉండేదో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆరున్నర పదుల వయసు నిండిన సమయంలో 20 ఏళ్ల యూత్‌ను కూడా తనతో కనెక్టయ్యేలా చేయగలిగిన చరిష్మా ఆయనది. ఆయన ఫాలోయింగ్, మార్కెట్ అన్నీ కూడా ఒక రేంజిలో ఉండేవి. భాషా భేదం లేకుండా రజనీ సినిమా కోసం తహతహలాడేవాళ్లు అభిమానులు. కానీ ఎంత హీరో అయినా వరుసగా ఫ్లాపులు వస్తే వెనుకంజ వేయక తప్పదని రజనీ విషయంలోనూ రుజువైంది.

గత కొన్నేళ్లలో రజనీ స్థాయికి తగని సినిమాలు చాలా చేశాడు. దీంతో ఫాలోయింగ్ దెబ్బ తింది. చివరగా రజనీ నుంచి వచ్చిన ‘దర్బార్’ అంచనాలకు చాలా దూరంలో ఉండిపోయింది. దానికి ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ ఫలితం కూడా రాలేదు. దీంతో రజనీ కొత్త సినిమా మీద జనాల్లో ఆసక్తి తగ్గిపోయింది.

అజిత్‌తో వరుసగా బ్లాక్ బస్టర్లు ఇచ్చిన మాస్ డైరెక్టర్ శివతో రజనీ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది. ఇంత భారీ చిత్రానికి నిన్న టైటిల్ ఖరారు చేస్తూ మోషన్ పోస్టర్ వదిలారు. ‘అన్నాత్తె’ అనే టైటిల్ ఈ చిత్రానికి ఖరారు చేశారు. ఐతే ఈ సందర్భంగా సోషల్ మీడియాలో.. ఇతర మీడియాలో ఎలాంటి హడావుడి కనిపించలేదు. తమిళ జనాలే ఈ సినిమా గురించి పెద్దగా చర్చించుకోవట్లేదు.

ఇంతకుముందు రజనీ సినిమా గురించి ఏ అప్ డేట్ వచ్చినా తెలుగు మీడియా ఎనలేని ప్రాధాన్యం ఇచ్చేది. మన జనాలు కూడా హ్యాష్ ట్యాగ్స్ పెట్టి సోషల్ మీడియాలో దాని గురించి చర్చించేవాళ్లు. ట్రెండ్ చేసేవాళ్లు. కానీ ‘అన్నాత్తె’ గురించి మాత్రం ఎవరూ మాట్లాడట్లేదు. అసలు ఈ అప్ డేట్ వచ్చినట్లు కూడా గుర్తించట్లేదు. పూర్తిగా తమిళ వాసనలతో నిండిన రొటీన్ మాస్ సినిమా లుక్ ఈ చిత్రంలో కనిపిస్తోంది. టైటిల్ కూడా అందుకు తగ్గ్టట్లే పెట్టారు. దీంతో జనాల్లో అసలు ఆసక్తి లేనట్లే ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English