నాని దెబ్బ తిన్నాడు.. అతణ్ని హెచ్చరించాడు

నాని దెబ్బ తిన్నాడు.. అతణ్ని హెచ్చరించాడు

ఫీల్డ్ ఏదైనా సరే.. రెండు పడవల ప్రయాణం అంత మంచిది కాదని పెద్దోళ్లు అంటుంటారు. ఇలా ప్రయాణం చేసి విజయవంతమైన వాళ్లు తక్కువగా కనిపిస్తారు. నానికి ఈ విషయంలో చేదు అనుభవం ఉంది. అందుకేనేమో.. యువ హీరో విశ్వక్సేన్‌ను కూడా హెచ్చరించాడట. ‘హిట్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో విశ్వక్ ఈ విషయాన్ని వెల్లడించాడు. నాని తనకు ఇచ్చిన అత్యుత్తమ సలహా.. ఒకేసారి రెండు సినిమాల్లో నటించొద్దు అన్నదే అని విశ్వక్ తెలిపాడు.

‘హిట్’ సినిమా చేస్తున్నపుడు తనకు మంచి కాన్ఫిడెన్స్ వచ్చిందని.. ఈ ఊపులో ఇంకో సినిమాను లైన్లో పెడదామనుకున్నానని.. ఐతే అప్పుడే నాని తనకు ఫోన్ చేసి హెచ్చరించాడని విశ్వక్ వెల్లడించాడు. తాను గతంలో ఒకేసారి రెండు సినిమాలు చేశానని.. దాని వల్ల గట్టి ఎదురు దెబ్బ తగిలిందని.. దీంతో మళ్లీ అలా ఎప్పుడూ చేయకూడదన్న నిర్ణయానికి వచ్చానని నాని తనకు చెప్పినట్లు విశ్వక్ తెలిపాడు.

ఒక సినిమా చేస్తున్నపుడు ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయి ఒక మూడ్‌లో ఉంటామని.. ఆ పాత్ర కోసం ఒక లుక్ కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుందని.. కాబట్టి మరో సినిమా కూడా చేస్తే ఇబ్బంది తప్పదని నాని తనకు చెప్పాడని విశ్వక్ చెప్పాడు. ఈ సలహా తనకు చాలా చాలా మంచి చేసిందని విశ్వక్ చెప్పుకొచ్చాడు. ఇంతకీ నాని ఒకేసారి రెండు సినిమాలు చేసి ఎప్పుడు దెబ్బ తిన్నాడన్న సందేహం కలగొచ్చు.

అతను ఒక టైంలో ‘జెండాపై కపిరాజు’తో పాటుగా ‘ఆహా కళ్యాణం’ సినిమా కూడా చేశాడు. వీటిలో ‘ఆహా కళ్యాణం’ ముందు రిలీజై అట్టర్ ఫ్లాప్ అయింది. ‘జెండాపై కపిరాజు’ అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఏడాదికి పైగా వాయిదా పడింది. చివరికి ‘ఎవడే సుబ్రహ్మణ్యం’తో పాటు ఒకే రోజు రిలీజైంది ‘ఎవడే..’ పర్వాలేదనిపించగా, ‘జెండాపై కపిరాజు’ ఫ్లాప్ అయింది. ‘ఎవడే..’ ఆడకపోయి ఉంటే అప్పుడు నాని కెరీర్ ఏమయ్యేదో. ఈ సినిమా విడుదలకు ముందు మాత్రం నాని బ్యాడ్ ఫేజ్‌లో ఉన్నాడు. ఆ అనుభవాలతోనే విశ్వక్‌ను హెచ్చరించినట్లున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English