నాన్-త్రివిక్రమ్ బిగ్గెస్ట్ హిట్ పక్కా

నాన్-త్రివిక్రమ్ బిగ్గెస్ట్ హిట్ పక్కా

టాలీవుడ్ బాక్సాఫీస్ కొంచెం గ్యాప్ తర్వాత మళ్లీ కళకళకలాడుతోంది. మహాశివరాత్రి కానుకగా విడుదలైన నితిన్ సినిమా 'భీష్మ' హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. తొలి రోజు ఈ సినిమా రూ.6.5 కోట్ల షేర్‌తో నితిన్ కెరీర్లోనే హైయెస్ట్ డే-1 గ్రాసర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. పండుగ కాబట్టి తొలి రోజు ఎక్కువ వసూళ్లు రాబట్టిందేమో అనుకున్నారు కానీ.. ఈ చిత్రం రెండో రోజు కూడా అదరగొట్టింది.

రూ.4.5 కోట్ల దాకా షేర్ రాబట్టింది. అన్ సీజన్ అయిన ఫిబ్రవరిలో ఓ మీడియం రేంజ్ మూవీకి ఇలాంటి వసూళ్లంటే చిన్న విషయం కాదు. ఆదివారం కూడా 'భీష్మ' అదరగొట్టేలా ఉంది. వీకెండ్ షేర్ రూ.15 కోట్లు దాటేలా ఉంది. ఈ చిత్రం రెండో వీకెండ్ కంటే ముందే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశముంది. ఫుల్ రన్ షేర్ ఈజీగా రూ.30 కోట్ల మార్కును దాటడం ఖాయం.

నితిన్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అంటే 'అఆ'నే. ఆ చిత్రం అప్పట్లో రూ.40 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. ఐతే ఆ సినిమా హిట్ క్రెడిట్లో నితిన్‌కు దక్కిన వాటా తక్కువే. అది ప్రధానంగా త్రివిక్రమ్ సినిమానే గుర్తింపు పొందింది. సమంత స్టార్ పవర్ కూడా దానికి తోడైంది. కాబట్టి 'అఆ' ఎంత పెద్ద హిట్టయినా.. నితిన్‌కు ఆ విజయాన్ని ఆపాదించడం కష్టమే. దీన్ని మినహాయిస్తే నితిన్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అంటే 'గుండెజారి గల్లంతయ్యిందే'నే. ఆ సినిమా అప్పట్లో రూ.25 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. దాన్ని 'భీష్మ' సునాయాసంగానే దాటేసేలా కనిపిస్తోంది.

రాబోయే కొన్ని వారాల్లో 'భీష్మ'కు పోటీ ఇచ్చే సినిమాలేవీ కనిపించడం లేదు. మార్చి నెలాఖర్లో 'వి' వచ్చే వరకు వచ్చేవన్నీ చిన్న సినిమాలే. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయిన 'భీష్మ' వచ్చే రెండు వారాలు మంచి వసూళ్లు సాధించే అవకాశముంది. కాబట్టి ఈ సినిమా ఫుల్ రన్లో అంచనాల్ని మించి షేర్ రాబట్టి నితిన్ కెరీర్లో నాన్-త్రివిక్రమ్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడం ఖాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English