ఆ హీరోకిది గేమ్ ఛేంజర్ అవుతుందా?

ఆ హీరోకిది గేమ్ ఛేంజర్ అవుతుందా?

గత ఐదారేళ్లలో తెలుగు సినిమాల్లోకి వచ్చిన ఆర్టిస్టుల్ని తీసుకుంటే.. వాళ్లలో ఒకానొక ఉత్తమ నటుడిగా సత్యదేవ్‌ను చెప్పొచ్చు. ముందు చిన్న చిన్న పాత్రలతో మెప్పించిన అతను.. ఆ తర్వాత లీడ్ రోల్స్‌లోనూ ఆకట్టుకున్నాడు. చిన్న, పెద్ద అని తేడా లేకుండా ఏ పాత్ర ఇచ్చినా మెప్పించగల నటుడతను. ఐతే సత్యదేవ్‌ టాలెంటుకు తగ్గ బ్రేక్ ఇంకా రాలేదనే చెప్పాలి.

గత ఏడాది 'బ్రోచేవారెవరురా' సినిమాతో మంచి విజయమే అందుకున్నా.. అందులో అతను సోలో హీరో కాకపోవడంతో పూర్తి క్రెడిట్ దక్కలేదు. 'బ్లఫ్ మాస్టర్' బ్రేక్ ఇస్తుందని ఆశించాడు కానీ.. అది వర్కవుట్ కాలేదు. మధ్యలో '48 డేస్' అనే ఓ సినిమా చేశాడు కానీ.. అది విడుదలకు నోచుకోలేదు. ఇలాంటి తరుణంలో సత్యదేవ్ నుంచి వస్తున్న 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చాలా ప్రామిసింగ్‌గా కనిపిస్తోంది.

'బాహుబలి' లాంటి మెగా మూవీ తర్వాత ఆ చిత్ర నిర్మాతలు ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా ఇది. 'కేరాఫ్ కంచరపాలెం'తో అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలందుకున్న వెంకటేష్ మహా డైరెక్ట్ చేస్తున్నాడు. తొలి సినిమాతో ఒరిజినల్ డైరెక్టర్ అనిపించుకున్న వెంకటేష్.. మలయాళంలో హిట్టయిన 'మహేషింటే ప్రతికారం' అనే క్లాసిక్ మూవీని రీమేక్ చేస్తుండటం విశేషం. దీనికి వెంకటేష్ తనదైన టచ్ ఇచ్చినట్లే కనిపిస్తున్నాడు. దీని టైటిల్.. ఫస్ట్ లుక్.. ఫస్ట్ టీజర్.. అన్నింట్లోనూ ఒక క్లాసిక్ లుక్ కనిపిస్తోంది. ఈ పాత్ర కోసం సత్యదేవ్ తనను తాను భలే మలుచుకున్నట్లున్నాడు.

అతడి లుక్ వావ్ అనిపిస్తోంది. టీజర్లో సత్యదేవ్ హావభావాలు కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. అతడి కెరీర్లో ఒక మైల్ స్టోన్ మూవీ అయ్యేలా ఉందీ చిత్రం. సినిమా అంచనాలకు తగ్గట్లు ఉంటే సత్యదేవ్‌కు పెద్ద బ్రేక్ ఇచ్చి కెరీర్లో ఒక గేమ్ ఛేంజర్‌లా నిలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చిత్రం ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English