సమీక్ష...భీష్మ

సమీక్ష...భీష్మ

గజిబిజి బతుకుల రోజులు ఇవి. జనం కాస్త వినోదానికే విరగబడి నవ్వేసేంత కరువులో వున్నారు. యూట్యూబ్ లో అందుబాటులోకి వస్తున్న అదిరింది, జబర్దస్త్, గ్యాంగ్ లీడర్, ఇలా ఏ టెలి షో చూసుకున్నా, ఫన్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ అన్నది సింగిల్ మోటో. సినిమాలదీ అదే పరిస్థితి. ఓ చిన్న థ్రెడ్..దాని చుట్టూ కాసిన్నిసన్నివేశాలు, వాటిల్లో మరి కాసిన్ని ఫన్ లైనర్లు, ఆపై కాస్త వినోదం. దీనికి లవ్ అండ్ రొమాంటిక్ తాళింపు. ఇంతకన్నా ప్రేక్షకులు మరీ అద్భుతాలు కోరుకోవడం లేదు. కానీ ఇక్కడ ఒక్కటే కండిషన్ అప్లయ్. మరీ ఎక్కువ నవ్వించకున్నా ఫరవాలేదు కానీ, నసపెట్టకూడదు, విసిగించకూడదు. అదీ సంగతి.

ఈ ఫార్ములాను అచ్చంగా ఒడిసి పట్టుకుని, పాస్ మార్కులు సంపాదించేసుకుంది ఈ వారం విడుదలైన భీష్మ. ఛలో సినిమాతో తన పెన్ కు కామెడీ టచ్ వుందని నిరూపించుకున్న దర్శకుడు వెంకీ కుడుముల అందించిన రెండో సినిమానే భీష్మ. లక్కీ లేడీ రష్మికతో హిట్ కోసం చూస్తున్న నితిన్ జతకట్టిన సినిమా.

భీష్మ అనే టైటిల్, సింగిల్ ఫరవర్ అనే ట్యాగ్ లైన్ తోనే అట్రాక్షన్ గ్రాబ్ చేసిన దర్ళకుడు సినిమాను వీలయినంత అందంగా ప్రెజెంట్ చేస్తున్నాడు అని చెప్పే మెటీరియల్ ను వదలడంతో మరింత ఆసక్తి పెంచగలిగాడు.  టైటిల్, ట్యాగ్ లైన్ తో ఎక్కడ మాంచి రొమాంటిక్ మూవీ అనుకుంటారో అని ట్రయిలర్ తో అసలు విషయం చెప్పేసారు.

అసలు విషయం ఏమిటంటే, ఆవారాగా తిరిగే భీష్మ(నితిన్), చైత్ర(రష్మిక) ను ప్రేమించి, ఆమె వెంట పయనిస్తూ సీనియర భీష్మ (అనంత్ నాగ్) కంపెనీకి సిఇఒ గా మారతాడు. అలాంటి సమయంలో రాఘవన్ (జిషు సేన్ గుప్తా) ను ఢీకొట్టాల్సి వస్తుంది. అలా ఢీకొట్టి భీష్మ కంపెనీను, తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు అన్నది అసలు సినిమా.

వాస్తవం చెప్పుకోవాలంటే పెద్దగా ఎక్స్ ర్ సైజ్ చేయకుండా, జస్ట్ అలా సింపుల్ గా అనుకున్న కథ ఇది. హీరో..ఆవారా..అమ్మాయి మంచి ఉద్యోగి, మంచి నేపథ్యం. ప్రేమించాడు. ఒప్పించాడు. కాబోయే మామ నో అనే టైమ్. అనుకోని అబద్దం. ట్విస్ట్. అది నిజం చేసుకునే ప్రయత్నం. ఆ క్రమంలో ఎదురైన సంఘటనలు. గెలుపు. నిజంగా చాలా సాదా సీదా కథ.

కానీ దీనికి తోడయింది, తొలిసగంలో రెండు మూడు మలి సంగంలో రెండు మూడు సీన్లు. వాటికి మంచి స్టార్ కాస్ట్. మంచి ఖర్చుతో చేసిన కలర్ ఫుల్ చిత్రీకరణ, అంతే పాస్ మార్కులు పడిపోయాయి.

భీష్మ సినిమాను చూడగానే దీన్ని ఇంకా బెటర్ గా తీసి వుండాల్సింది. ఇంకా ఫైన్ ట్యూన్ చేసుకోవాల్సింది. అప్పుడు యునానిమస్ గా పెద్ద హిట్ దర్శకుడి చేతిలోకి వచ్చి వుండేది. ప్రస్తుతం పాస్ మార్కులతో సరిపెట్టేసుకున్నాడు..అని అనిపిస్తుంది.

భీష్మ పాజిటివ్ థింగ్స్ ముందుగా ముచ్చటించేసుకుందాం. సినిమా ప్రశాంతంగా వుంటుంది. ఎక్కడా ప్రేక్షకుడిని ఇబ్బంది పెట్టకుండా, మెదడుకు పదును పెట్టకుండా, స్క్రీన్ ప్లే ను ఫాలో కావాల్సిన పని లేకుండా వుంటుంది. ఏ సీన్ కు ఆ సీన్ నే ఎంజాయ్ చేసుకుంటూ ముందుకు వెళ్లిపోవడమే. దర్శకుడు లేదా సినిమా లక్ ఏమిటంటే, బాగున్న సన్నివేశాలు బాగుండడం, మిగిలిన సన్నివేశాలు బాగా లేకపోయినా, బాగాలేవు అనే ఫీల్ కలిగించకుండా పాస్ ఆన్ అయిపోవడం. గుడ్ ఫిల్మ్ వేరు. బ్యాడ్ ఫిల్మ్ కాకపోవడం వేరు. ఈ రెండింటి మధ్యకు వస్తుంది భీష్మ సినిమా.

ముందుగా చెప్పుకున్నట్లు, ఎప్పుడయితే బ్యాడ్ ఫిల్మ్ కాదో, ఎప్పుడయితే తొలిసగం, మలిసగంలో ఎంజాయ్ చేసే సీన్లు కొన్ని పడ్డాయో, సగటు సినిమా ప్రేక్షకుడికి సరిపోయింది. పాస్ అయిపోయింది.

భీష్మ సినిమా తొలిసగం ఏ పటాటోపం లేకుండా రొటీన్ గా స్టార్ట్ అవుతుంది. సింగిలే..మింగిలే..పాట అడియో పెద్ద హిట్ కావడం, దానికి తగినట్లు కాంటెంపరరీ స్టయిల్ లో చిత్రీకరణ వుండడంతో అక్కడ ఓ మార్కు పడిపోతుంది. ఆ పాటకు ముందు, వెనుక లైట్ ఫన్ టచ్ సీన్లు మరి కొన్ని మార్కులు జోడిస్తాయి. హీరో-హీరోయిన్ తండ్రి చాటింగ్ సీన్లు, మందు సీన్లు అలాంటి వాటిల్లో కొన్ని. ఆ తరువాత సినిమా మళ్లీ కాస్త ఫ్లాట్ గా వెళ్తుంది. మధ్యలో వెన్నెల కిషోర్, రవిబాబు వచ్చి ఒకటి రెండు మార్కులకు ఆదుకుంటారు. మరీ అద్భుతం అనిపించకుండానే ఓ ట్విస్ట్ తో విశ్రాంతి వచ్చేస్తుంది.

విశ్రాంతి తరువాత ట్విస్ట్ మరో ట్విస్ట్ గా మారినా పెద్దగా మార్కులు పడవు. వన్స్ సినిమా హీరోను సిఇఒ గా మార్చిన తరువాత ఆఫీసు సీన్లు మళ్లీ సినిమాను ఆదుకుంటాయి. వెన్నెల కిషోర్-రవిబాబు కలిసి కొన్ని మార్కులు జోడిస్తారు. ఆ తరువాత సినిమా కథ మీద కాస్త నడుస్తుంది. డౌన్ అవుతోంది అనుకున్నటైమ్ లో మాస్ నెంబర్ సాంగ్ వచ్చి సినిమాను ముందుకు పరుగెత్తించడం ప్రారంభిస్తుంది. ఆ తరువాత క్లయిమాక్స్, ఎక్స్ టెండెడ్ క్లయిమాక్స్ కలిసి మరిన్ని మార్కులు జోడిస్తాయి.

అలా కొన్ని మామూలు సీన్లు, మరికొన్ని బాగున్న సీన్లు కలిసి సినిమాను పాస్ చేయించేస్తాయి.

ఇప్పుడు నెగిటివ్ సైడ్ కు వస్తే, సినిమాలో కామెడీ ట్రాక్ ను విశాల్ మగమహారాజులో సంతానం ట్రాక్ నుంచి తెచ్చుకున్నట్లు అర్థమైపోతూ వుంటుంది. అలాగే క్లయిమాక్స్ మరీ వీక్ అనిపిస్తుంది. మామూలు మీడియం కామెడీ సినిమా కాబట్టి లాజిక్ లు పెద్దగా అవసరం వుండకపోవచ్చు. సినిమా ను మరింత బెటర్ గా తీసి వుండాల్సింది. తీసే అవకాశం వుంది. సినిమాలో చాలా సీన్లు దర్శకుడికి ఇంకా అనుభవం పండాల్సిన అవసరాన్ని ఎత్తి చూపిస్తాయి.  

ముఖ్యంగా పాత్రలను డిజైన్ చేయడంలో దర్శకుడికి మైనస్ మార్కులే. హీరోయిన్, విలన్ పాత్రలను ఇంకా బాగా డిజైన్ చేయాల్సింది. ఇదే సినిమా మరో నాలుగైదు సినిమాల తరువాత వెంకీ కుడుముల కచ్చితంగా ఇలా అయితే తీయడు అది పక్కా. మరింత బాగా ఫైన్ ట్యూన్ చేసుకుంటాడు. అదే ఫైన్ ట్యూన్ కనుక ఈ సినిమాలో జరిగి వుంటే ఇది మరింత పెద్ద సినిమా అయి వుండేది.

ఇప్పుడు మాత్రం డీసెంట్ హిట్ అనే వర్డ్ తో సరిపెట్టుకోవాలి.

ఈ సంగతి అలా వుంచితే, భీష్మ సినిమాలో హీరోయిన్ రష్మిక కన్నా, హీరో నితిన్ అందంగా కనిపించాడు. సినిమా మొత్తం కలర్ పుల్ గా వుంది. సినిమా మొత్తం రిచ్ నెస్ ను చూపించడంలో నిర్మాతల వ్యయం కనిపిస్తోంది. స్వరసాగర్ సంగీతంలో మూడు పాటలు బాగుండడం అన్నది సినిమాకు పెద్ద ప్లస్ అయింది.

మొత్తం మీద అల వైకుంఠపురములో సినిమా తరువాత జనాలకు వినోదం కరువు కొంత అయినా తీర్చే సినిమా భీష్మ.

రేటింగ్-3/5
ఫినిషింగ్ టచ్... ఫన్ ఫరెవర్

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English