కమల్ కోటి.. నిర్మాత మాట్లాడడేం?

కమల్ కోటి.. నిర్మాత మాట్లాడడేం?

ఇండియన్-2 సెట్స్‌లో జరిగిన ప్రమాదాన్ని భారతీయ సినీ పరిశ్రమ చరిత్రలోనే అతి పెద్ద విషాదాల్లో ఒకటిగా చెప్పొచ్చు. షూటింగ్ స్పాట్లో క్రేన్ కూలి ఒకేసారి ముగ్గురు కీలకమైన యూనిట్ సభ్యులు చనిపోవడం.. పది మంది దాకా తీవ్రంగా గాయపడటం దారుణమైన విషయం. ఈ ఘోరానికి బాధ్యులెవరన్నది తేలాల్సి ఉంది. దీనిపై పోలీసు విచారణ కూడా జరగనుంది. స్టూడియో నిర్వాహకులు, నిర్మాతల వైఫల్యంపై పెద్ద చర్చ నడుస్తోంది.

లైకా ప్రొడక్షన్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ షూటింగ్ ఏర్పాట్ల విషయంలో ఎందుకు అలక్ష్యం ప్రదర్శించింది.. క్వాలిటీ లేని క్రేన్‌‌ను షూటింగ్‌కు ఎలా తీసుకొచ్చారు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే.. కార్పొరేట్ రంగం నుంచి వచ్చిన లైకా సంస్థ తీరు మొదట్నుంచి వివాదాస్పదమే.

తమ సినిమాలతో నష్టపోయిన బయ్యర్ల విషయంలో ఇంతకుముందు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన నేపథ్యంలో ప్రస్తుత ప్రమాద బాధితుల కుటుంబాల్ని ఏమాత్రం పట్టించుకుంటుందనే సందేహాలు కలుగుతున్నాయి. ప్రమాదం గురించి ఇచ్చిన ప్రెస్ నోట్లో లైకా సంస్థ చనిపోయిన వారికి ప్రగాఢ సంతాపం మాత్రమే ప్రకటించింది. అంతకుమించి వారిని తాము ఎలా ఆదుకోబోతున్నది వెల్లడించలేదు. పరిహారం గురించి మాట్లాడలేదు.

కానీ చిత్ర కథానాయకుడు కమల్ హాసన్ తన బాధ్యత లేకపోయినా.. పెద్ద మనసుతో ముగ్గురు బాధితుల కుటుంబాలకు తన వంతుగా కోటి రూపాయల విరాళం ప్రకటించాడు. హీరో కోటి రూపాయల విరాళం ప్రకటిస్తే.. అన్నిటికీ బాధ్యత వహించాల్సిన నిర్మాణ సంస్థ మౌనంగా ఉండటం విమర్శలకు తావిస్తోంది. వాళ్లకు బాధిత కుటుంబాల్ని ఆదుకునే విషయంలో ఏమైనా ఆలోచనలున్నాయో లేదో తెలియదు కానీ.. కమల్ కంటే ముందు వాళ్లు స్పందించాల్సింది. కమల్ ప్రకటన రాగానే.. లైకా వాళ్లను తిడుతూ సోషల్ మీడియా జనాలు పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు వాళ్లు రెస్పాండయినా అది విమర్శల తాకిడితో స్పందించినట్లే ఉంటుందనడంలో సందేహం లేదు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English