ఏ ముహూర్తాన ఆ సినిమా మొదలుపెట్టారో కానీ..

ఏ ముహూర్తాన ఆ సినిమా మొదలుపెట్టారో కానీ..

'భారతీయుడు' సీక్వెల్ గురించి దశాబ్దం కిందట్నుంచి చర్చ జరుగుతోంది. ఆ సినిమా కోసం ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. విఫలమయ్యాయి. ఒక దశలో ఈ సినిమా ఇక లేదని అందరూ విడిచిపెట్టేశారు. కానీ మూడేళ్ల కిందట శంకర్ మళ్లీ దీని ఊసెత్తాడు. ఈ సినిమా చేయడానికి సన్నాహాలు చేశాడు. కానీ ఏ ముహూర్తాన సినిమా ఖరారైందో కానీ.. అప్పట్నుంచి ఏదో ఒక అడ్డంకి తప్పడం లేదు. ముందు దిల్ రాజు ప్రొడక్షన్లో ఈ సినిమా చేయాలనుకున్నారు. కానీ శంకర్ అండ్ టీంతో కొన్ని రోజుల ప్రయాణం తర్వాత రాజు ఈ సినిమాకు దూరం అయిపోయాడు. దీంతో సినిమా పట్టాలెక్కడంలో జాప్యం జరిగింది. తర్వాత నిర్మాతల కోసం శంకర్ వేట సాగించాడు. కానీ ఎవరూ కుదరక చివరికి తనతో '2.0' తీసిన లైకా ప్రొడక్షన్ వాళ్లనే ఒప్పించాడు. కానీ చిత్రీకరణ మొదలైన కొన్ని రోజులకే బ్రేక్ పడింది. ఏడెనిమిది నెలల పాటు మళ్లీ షూటింగ్ మొదలు కాలేదు.

కమల్‌కు మేకప్ కుదరక కొన్నాళ్లు.. బడ్జెట్ విషయంలో నిర్మాతలతో శంకర్‌కు తలెత్తిన విభేదాలతో కొన్నాళ్లు.. కమల్ పొలిటికల్ కమిట్మెంట్ల వల్ల ఇంకొన్నాళ్లు.. మరేవో కారణాలతో ఇంకొన్ని రోజులు.. ఇలా సినిమా వెనక్కి వెనక్కి వెళ్తూ వచ్చింది. చివరికి అన్ని సమస్యలూ పరిష్కరించుకుని ఈ మధ్యే షూటింగ్ పున:ప్రారంభించారు. కొన్ని రోజుల పాటు విరామం లేకుండా షూటింగ్ చేస్తుండేసరికి యూనిట్ సభ్యులందరిలో ఉత్సాహం వచ్చింది. ఈ ఊపులో వేగంగా సినిమా పూర్తి చేసేద్దాం అనుకుంటే.. ఇప్పుడు సెట్లో జరిగిన ఘోర ప్రమాదంతో ‘భారతీయుడు-2’కు దిక్కు తోచని స్థితిలో పడిపోయింది.

ఈ ఏడాది తమిళనాట అసెంబ్లీ ఎన్నికలున్నాయి. వాటి కోసం కమల్ సిద్ధమవుతున్నాడు. సాధ్యమైనంత త్వరగా 'భారతీయుడు-2' పూర్తి చేసి అటు వెళ్లాలని చూస్తున్నాడు. ఇంతలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. దీని కారణంగా షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఇప్పుడున్న ట్రామాలో శంకర్ అండ్ టీం వెంటనే షూటింగ్ ఆరంభించడం కష్టం. చిత్రీకరణ మళ్లీ మొదలైనా మునుపటిలా సాగుతుందా అన్నది సందేహమే. ప్రస్తుత బ్రేక్ వల్ల షెడ్యూళ్లన్నీ తారుమారవుతున్నాయి. డేట్ల సమస్య తలెత్తనుంది. ఈ పరిస్థితుల్లో అనుకున్న ప్రకారం షూటింగ్ సాగడం కష్టం. కమల్ రాజకీయాల వైపు వెళ్తే.. మళ్లీ ఎప్పుడు తిరిగి ఈ సినిమా సెట్స్‌లోకి వస్తాడో తెలియదు. మొత్తానికి ‘ఇండియన్-2’ను ఏ ముహూర్తాన మొదలుపెట్టారోకానీ.. అది ఒక పట్టాన తేలే వ్యవహారంలా కనిపించడం లేదు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English