ఆ ఫిలిం సిటీ.. ఇలాంటి ఘోరాలకు కేరాఫ్ అడ్రస్

ఆ ఫిలిం సిటీ.. ఇలాంటి ఘోరాలకు కేరాఫ్ అడ్రస్

ఇండియన్-2 సెట్స్‌లో జరిగిన ఘోర ప్రమాదం గురించి ఊహించుకున్నా ఒళ్లు గగుర్పొడుస్తోంది జనాలకు. టన్నుల కొద్దీ బరువున్న క్రేన్ వచ్చి మీద పడితే ఏమవుతుందో చెప్పేదేముంది? వందల కోట్ల బడ్జెట్లు పెట్టి సినిమా తీస్తూ భారీ సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నపుడు అన్నీ జాగ్రత్తగా చూసుకుని ఉండాల్సింది.

ఐతే ఈ విషయంలో చిత్ర బృందానిది మాత్రమే తప్పుగా కనిపించడం లేదు. ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్న ఈవీపీ ఫిలిం సిటీ నిర్వాహకుల వైఫల్యం కూడా ఉందన్న వార్తలొస్తున్నాయి. ఈ స్టూడియోలో తరచుగా భారీ ప్రమాదాలు జరుగుతుండటం, ప్రాణాలు పోతుండటం ఆందోళన పెంచుతోంది. స్టూడియోల్లో చిత్రీకరణ జరిగేటపుడు సన్నివేశానికి తగ్గ అవసరాల్ని సమకూర్చేది స్టూడియోనే. ‘ఇండియన్-2’ సినిమాలో భారీ సన్నివేశాల చిత్రీకరణ కోసం క్రేన్లు సమకూర్చింది కూడా ఆ స్టూడియో వాళ్లే అంటున్నారు. క్రేన్ కూలడంలో బాధ్యత వాళ్లదే అని చెబుతున్నారు.

ఈ ఫిలిం సిటీలో గత రెండేళ్లలో ఇంకొన్ని ఘోర ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. రెండేళ్ల కిందట రజనీకాంత్ సినిమా కాలా చిత్రీకరణ సందర్భంగా మైకేల్ అనే టెక్నీషియన్ ప్రాణాలు కోల్పోయాడు. అతను కరెంట్ వైర్ మీద అడుగు వేయడంతో షాక్ కొట్టి చనిపోయాడు. ఆ తర్వాత ఇదే స్టూడియోలో వేసని ‘బిగ్ బాస్-2’ సెట్స్‌లో కూడా ప్రమాదం జరిగింది. అప్పుడు గుణశేఖరన్ అనే టెక్నీషియన్ ప్రాణాలు కోల్పోయాడు.

అతను సెట్ రెండో ఫ్లోర్ నుంచి కింద పడి చనిపోయాడు. ఆపై ఇదే స్టూడియోలో విజయ్ సినిమా ‘బిగిల్’ చిత్రీకరణ సందర్భంగానూ పెద్ద ప్రమాదం జరిగింది. 100 అడుగుల ఎత్తు ఉన్న క్రేన్ మీద అమర్చిన లైటింగ్ సెటప్ కింద పడగా.. ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతను దాదాపుగా చావు దగ్గరగా వెళ్లాడు. చికిత్స తర్వాత ప్రాణాలతో బయటపడ్డాడు. ఇప్పుడు ఏకంగా 150 అడుగుల ఎత్తున్న క్రేన్ కూలి ‘ఇండియన్-2’ టీంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పది మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈవీపీ స్టూడియో నిర్వాహకుల మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇకపై ఇక్కడ షూటింగ్ చేయడంపై తమిళ ఫిలిం మేకర్స్ పునరాలోచనలో పడటం ఖాయం.


 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English