పవన్.. మళ్లీ మళ్లీ అదే మాట చెప్పకయ్యా

పవన్.. మళ్లీ మళ్లీ అదే మాట చెప్పకయ్యా

గతంతో పోలిస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటల్లో పరిణతి కనిపిస్తోంది. ప్రతి విషయం మీదా ఆచితూచి మాట్లాడుతున్నాడు. తన వ్యాఖ్యలు వివాదాస్పదం కాకుండా చూసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. జనాల్ని ఆలోచింపజేసేలాగా కూడా మాట్లాడుతున్నాడు. తాను సినిమాల్లోకి పునరాగమనం చేయడం గురించి ప్రత్యర్థులు విమర్శలు చేస్తుంటే.. దానికి కౌంటర్‌గా ఇటీవల పవన్ చేసిన వ్యాఖ్యలు రీజనబుల్‌గా అనిపించాయి.

ముఖ్యంగా తాను మళ్లీ సినిమాల్లో నటించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పార్టీని వీడిన లక్ష్మీనారాయణకు పవన్ చెప్పిన సమాధానం అందరినీ ఆకట్టుకుంది. కానీ కొన్నిసార్లు ఇలా ఆకట్టుకుంటూనే.. కొన్నిసార్లు మాటల తడబడుతున్నాడు పవన్. తన పిల్లల స్కూలు ఫీజు కట్టడం కోసం తాను మళ్లీ సినిమాలు చేస్తున్నట్లు పవన్ ఇంతకుముందు ఓసారి వ్యాఖ్యానించి విమర్శలెదుర్కొన్నాడు.

ఇప్పుడు మరోసారి అదే వ్యాఖ్యలు చేశాడు పవన్. తన కుటుంబ సభ్యులు, తనను నమ్ముకున్న వాళ్ల కోసం.. పార్టీని నడిపించడం కోసం తనకు ఆదాయం అవసరమని.. అందుకే సినిమాలు చేస్తున్నానని అంటే బాగానే ఉంటుంది. పిల్లల భవిష్యత్తు అన్నా కూడా ఓకే. కానీ పిల్లల ఫీజుల కోసం సినిమాలు చేస్తున్నా అంటేనే అతిశయోక్తిగా అనిపిస్తుంది.

పిల్లల ఫీజులంటే లక్షల్లోనే ఉంటాయి. కానీ పవన్ ఒక్కో సినిమాకు 40 నుంచి 50 కోట్ల దాకా పుచ్చుకుంటున్నాడన్నది బహిరంగ రహస్యం. ఇంతేసి పారితోషకాలు తీసుకుంటున్నది స్కూలు ఫీజుల కోసం అంటే వినేవాళ్లకు ఎలా ఉంటుంది? పవన్ ఏం మాట్లాడినా.. దాన్ని వివాదం చేయడానికి ప్రత్యర్థి పార్టీల వాళ్లు.. మీడియా రెడీగా ఉంది. స్కూల్ ఫీజులు కట్టడం కోసం పవన్ సినిమాలు చేస్తున్నాడట అని హెడ్డింగ్స్ పెట్టి ఎంత యాగీ చేయాలో అంతా చేస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ ఇకముందైనా ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వకుండా జాగ్రత్త పడితే బెటర్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English