కొంద‌రు నా చావు కోరుతున్నారు: మోడీ

యూపీ ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కొంద‌రు త‌న చావు కోరుతున్నార‌ని.. అయినా తాను వెన‌క్కి త‌గ్గేది లేద‌ని.. స్ప‌ష్టం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం సమాజ్వాదీ పార్టీపై విమర్శలతో విరుచుకుపడ్డారు. కొందరు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని, చివరికి తన చావును కూడా కోరుకుంటున్నా రంటూ ధ్వజమెత్తారు. అయితే ఆ విషయంలో తాను ఆనందంగా ఉన్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికలు చివరి దశకు చేరుకున్న వేళ ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్‌వాదీ పార్టీపై ప్రధాని మోడీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ గతేడాది ఓ సందర్భంలో చేసిన వ్యాఖ్యలనుద్దేశిస్తూ మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. గతేడాది ప్రధాని మోడీ వారణాసిలో పర్యటించారు. ఈ పర్యటన గురించి అఖిలేశ్‌ యాదవ్‌ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. “మంచిదే. ఒకరోజు కాదు.. మూడు నెలలైనా వారణాసిలో ఉండొచ్చు. అలా ఉండడానికి పూర్తి అనువైన ప్రదేశం. ఎందుకంటే చివరి రోజుల్లో అందరూ వారణాసిలోనే గడపాలని కోరుకుంటారు” అంటూ వ్యాఖ్యానించారు.

దీనిపై అప్పట్లోనే దుమారం రేగడంతో అఖిలేశ్‌ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయన్న ఉద్దేశంలో తాను ఆ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్నారు. తాజాగా ఆ వ్యాఖ్యలపై ప్రధాని స్పందించారు. చివరి రెండు దశల ఎన్నికల ప్రచారంలో భాగంగా వారణాసిలో పర్యటించిన ఆయన.. ఆ వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు.

“కొందరు నేతలు పూర్తిగా దిగజారిపోయి వ్యవహరిస్తున్నారు. కొందరైతే ఏకంగా నా చావును కూడా కోరుతున్నారు. అదీ వారణాసిలోనే కావాలని కోరుకుంటున్నారు. ఈ విషయంలో నేను ఆనందంగా ఉన్నా. వారణాసి ప్రజలతో చివరి వరకు జీవించే అవకాశం దక్కుతున్నందుకు, ప్రాణం పోయే వరకు వారికి సేవ చేసుకునే భాగ్యం దక్కుతున్నందుకు ఆనందంగా ఉంది” అని మోడీ పేర్కొన్నారు.